ఏఐ సమిట్లో.. ఎక్స్పర్టుల కోసం కోసం వేట.. అదానీ, రిలయన్స్లో భారీగా నియామకాలు

ఏఐ సమిట్లో.. ఎక్స్పర్టుల కోసం కోసం వేట.. అదానీ, రిలయన్స్లో భారీగా నియామకాలు
  • ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు
  • క్లౌడ్​ డెవలపర్లకు మస్తు డిమాండ్​

న్యూఢిల్లీ: ఏఐతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య, ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేలాది మంది యువ ఇంజనీర్లకు ఉపాధి మార్గాలను చూపిస్తోంది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదానీ గ్రూప్ భారీగా నియామకాలు చేపడుతున్నాయి. వీటితో పాటు డెల్ టెక్నాలజీస్, సేల్స్ ఫోర్స్, ఎర్నెస్ట్​ అండ్​ యంగ్​(ఈవై), డెలాయిట్ వంటి కంపెనీలు ట్యాలెంట్​ కోసం వెతుకుతున్నాయి.

ఇన్ఫోసిస్, ఆంత్రోపిక్​తో కలిసి నియామకాలపై దృష్టి సారించింది. గూగుల్ తన ఏఐ హబ్ కోసం ఉద్యోగులను తీసుకుంటోంది. కచ్చితమైన సంఖ్యను ప్రకటించనప్పటికీ, ఈవై వంటి సంస్థలు ప్రస్తుతానికి కొన్ని డజన్ల మందిని తీసుకుంటున్నాయి.

ఏఐ రంగంలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినందున రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, క్లౌడ్ డెవలపర్లతో పాటు సైబర్ ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. సాధారణ కోడింగ్ కన్నా ఏఐ మేనేజ్​మెంట్​ తెలిసిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

రెజ్యూమ్​లు నేరుగా సమర్పించే అవకాశం ఉండటంతో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అదానీ కనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రియాన్షి బావిషి మాట్లాడుతూ ఈ రంగం ప్రాథమిక దశలోనే ఉందని, అర్హత ఉన్న వారికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.   

ఉన్న ఉద్యోగాలు పోతాయ్​.. కొత్తవి వస్తాయ్: నిలేకని
 ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో–ఫౌండర్​ నందన్ నీలేకని హెచ్చరించారు.  అదే సమయంలో 17 కోట్ల కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్వహించిన ఏఐ సమిట్​లో ఆయన మాట్లాడుతూ.. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఓపెన్​ ఏఐతో ఎటర్నల్​ జోడీ
జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థల పేరెంట్​కంపెనీ ఎటర్నల్ తన ఏఐ సామర్థ్యాలను పెంచుకునేందుకు ఓపెన్ ఏఐ సంస్థతో చేతులు కలిపింది. బిజినెస్​ పార్ట్​నర్లు, డెలివరీ పార్ట్​నర్ల కోసం ఏఐ ఆధారిత పని విధానాలను ప్రవేశపెట్టడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.  స్టిచ్ పేరుతో ఉన్న తమ ఇంటర్నల్​ ఆటోమేషన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో జీపీటీ 5.3 కోడెక్స్ వంటి అత్యాధునిక మోడళ్లను వాడనున్నారు. పాత పద్ధతులను తగ్గించి, వేగంగా సేవలు అందించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఎటర్నల్​ తెలిపింది.

అదానీ పెట్టుబడి రూ.8.5 లక్షల కోట్లు
అదానీ గ్రూప్ 2035 నాటికి ఏఐ డేటా సెంటర్ల అభివృద్ధి కోసం 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.5 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించింది. సోలార్​వంటి క్లీన్​ఎనర్జీతో నడిచే ఈ కేంద్రాలు దేశంలో 250 బిలియన్ డాలర్ల ఏఐ మౌలిక సదుపాయాల వ్యవస్థను సృష్టిస్తాయని గౌతమ్ అదానీ తెలిపారు. వైజాగ్​లో గూగుల్ సహకారంతో, హైదరాబాద్, పుణేలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ భాగస్వామ్యంతో రెండో ఏఐ డేటా సెంటర్ సిద్ధమవుతోంది.

2050 నాటికి ఉద్యోగాలే ఉండవు: వినోద్​ ఖోస్లా
ఏఐ వల్ల 2050 నాటికి ఉద్యోగాల అవసరం ఉండకపోవచ్చని ప్రముఖ పెట్టుబడిదారు వినోద్ ఖోస్లా అంచనా వేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్​లో ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో ఐటీ సేవలు, బీపీఓ రంగాలు పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున సంప్రదాయ ఉపాధి మార్గాలు దెబ్బతింటాయని,  ఐటీ రంగంపై ఆధారపడిన భారత్ వంటి దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

డాక్టర్లకు ఏఐ సాటి రాదు: మంత్రి అనుప్రియ
డాక్టర్లను ఏఐ భర్తీ చేస్తుందనే ఆందోళనలు అనవసరమని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ స్పష్టం చేశారు.  ఏఐ కేవలం వారికి సహాయకారిగా మాత్రమే ఉంటుందని, వారి స్థానాన్ని తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. వైద్య రంగంలో మానవీయ స్పర్శ, సానుభూతి అవసరమని, వీటిని టెక్నాలజీ అందించలేదని పేర్కొన్నారు. సాధారణ పనులను ఏఐ చూసుకుంటే, డాక్టర్లు క్లిష్టమైన కేసులపై దృష్టి పెట్టవచ్చని ఆమె అన్నారు.