అంబేద్కర్ విధానాలతోనే KCR ఉద్యమించారు : KTR

అంబేద్కర్ విధానాలతోనే KCR ఉద్యమించారు : KTR

అంబేద్కర్ అన్ని కులాలు, అన్ని వర్గాలకు చెందిన వారన్నారు TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. హైదరాబాద్‌ లోని TRS పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్…. అంబేద్కర్ అందరి నాయకుడన్నారు. కొత్త, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ అనుమతి, తీర్మానం అవసరం లేకుండా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారని తెలిపారు. దీంతో తెలంగాణ ఏర్పాటు సులభమయ్యిందన్నారు. మైనార్టీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ … అంబేద్కర్ విధానాలతోనే ముందుకెళ్లారన్నారు KTR. అంబేద్కర్ తత్వం, సిద్ధాంతాలు దేశానికి అవసరమన్న కేటీఆర్…మైనార్టీ హక్కులను ప్రభుత్వాలు కాపాడగలినప్పుడే  ఆయన ఆశయాలు నెరవేర్చినట్లవుతుందన్నారు. అంబేద్కర్ ని ఏ ఒక్క వర్గానికి చెందిన నాయకుడిగా వక్రీకరించకూడదన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నా అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీఎంను కోరుతున్నా అన్నారు కేటీఆర్.

దళితులను అభివృద్ధి చేయడానికి రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహానేత అంబేద్కర్ అన్నారు హోం మంత్రి మహమూద్ అలీ. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని తెలిపారు.