ఖమ్మం: రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది సుఫారీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఆర్థిక లావాదేవీలే ఆయన హత్యకు దారి తీశాయని స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురిని ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కట్ పల్లి, నకిరే కల్ మధ్య హత్య చేసి పాలేరు రిజర్వాయర్ లో మృత దేహాన్ని పడేశారు. నిందితులు దీన్ని ఆ తర్వాత కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి,హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 14న ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకెళ్లింది. కారును బయటకు తీయగా వెనుక సీటులో శ్రీనివాస్ మృతదేహం లభించింది. మొదట ఇది ప్రమాదమని భావించినా, కారు నడిపిన వ్యక్తి పరారవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రేన్ సహాయంతో నీట మునిగిన కారును పోలీసులు వెలికి తీశారు. శ్రీనివాస్ సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు ఆర్థిక లావాదేవీల కారణంగానే చంపినట్లు తేల్చారు.
శ్రీనివాస్ పదేళ్లుగా హైదరాబాదులో ఉంటున్నారు. ‘పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశ సమయంలో పవన్ కల్యాణ్ హటావో, పాలిటిక్స్ బచావో పేరుతో ఈయన రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రమాదం ఉందంటూ ఆయన పోలీసులను కూడా ఆశ్రయించారు.
