
- బతుకమ్మ సంబురాలకు హాజరు
- 5 ఎకరాల్లో కుంటకు పునరుజ్జీవం పోసిన హైడ్రా
- రూ.7.40 కోట్లతో సుందరీకరణ పనులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంటని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తర్వాత ఇక్కడే 2,500 మందితో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారు. పూర్తిగా నామ రూపాల్లేకుండా పోయిన బతుకమ్మ కుంటకు హైడ్రా పూర్వ వైభవం తీసుకొచ్చింది.
1962–63 లెక్కల ప్రకారం ఇక్కడ 14 ఎకరాల 6 గుంటలు ఉండగా, అప్పట్లో బఫర్ జోన్ తో కలిపి 16 ఎకరాల 13 గుంటలు ఉండేది. క్రమంగా ఆక్రమణలకు గురికాగా.. మిగిలి ఉన్న 5 ఎకరాల 15 గుంట భూమిలో రూ.7.40 కోట్లతో బతుకమ్మ కుంటను హైడ్రా డెవలప్ చేసింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు ఇన్లెట్, ఔట్లెట్ ఏర్పాటు చేసింది. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ సెట్ చేసింది. వాక్ వే చుట్టూ అధికారులు చెట్లు నాటించారు.
వివాదాలనుంచి బయటపడి...
నిర్మాణ వ్యర్థాలతో బతుకమ్మ చెరువును పూడ్చేసి ఆనవాళ్లు లేకుండా ఆక్రమించేశారు. ఆ భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌తో ఓ వ్యక్తి దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మకుంట బాధ్యతలు హైడ్రా తీసుకున్నది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీతో కలిసి చెరువు చరిత్రను తవ్వి తీసింది.
అన్ని విభాగాలతో కలిసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి బతుకమ్మకుంట చెరువే అని నిర్ధారించుకున్నది. బతుకమ్మ కుంట పునరుద్ధరణ ప్రక్రియలో హైడ్రా ఎన్నో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నది. కబ్జాదారులు వేసిన పిటిషన్లపై కోర్టులు కూడా ఇది చెరువు భూమి అని స్పష్టం చేశాయి. దీంతో బతుకమ్మకుంట అభివృద్ధికి అడ్డంకులు తొలగడంతో హైడ్రా పనులు పూర్తి చేసింది.