అమెరికాకు రోజూ 135 కోట్ల డాలర్ల ఖర్చు! ఇరాక్ యుద్ధం మొదటి దశ కంటే ఇప్పుడే ఎక్కువ వ్యయం

అమెరికాకు రోజూ 135 కోట్ల డాలర్ల ఖర్చు! ఇరాక్ యుద్ధం మొదటి దశ కంటే ఇప్పుడే ఎక్కువ వ్యయం
  • మిసైల్స్, డ్రోన్లు, షిప్​లు, ఇంధనం కోసం పెరిగిపోతున్న ఖర్చు

వాషింగ్టన్: అమెరికా-–ఇజ్రాయెల్ ఇరాన్‌‌పై యుద్ధం మొదలుపెట్టిన మొదటి ఆరు రోజుల్లోనే 1,130 కోట్ల డాలర్లు ఖర్చు అయినట్టు అమెరికా అధికారుల వర్గాలు చెప్తున్నాయి. యుద్ధం 12వ రోజు నాటికి ఈ ఖర్చు 1,650 కోట్ల డాలర్లకు చేరిందని సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్​ఐఎస్) అంచనా వేసింది. క్షిపణి దాడులు, ఇంటర్‌‌సెప్టర్లకు 560 కోట్ల డాలర్లు, ఎయిర్​ఫోర్స్ కార్యకలాపాలకు 230 కోట్ల డాలర్లు, మూడు ఎఫ్–15 యుద్ధ విమానాల రీప్లేస్‌‌మెంట్‌‌కు 31 కోట్ల డాలర్లు అయినట్టు లెక్కలు చెప్తున్నాయి. 

యుద్ధం ప్రారంభానికి ముందు గతేడాది డిసెంబర్ నుంచి 12 నౌకలు, 100కుపైగా యుద్ధ విమానాలను ఇరాన్​కు సమీపంలో మోహరించడానికి 63 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఇరాన్ ఇప్పటి వరకు 2 వేలకుపైగా డ్రోన్లు, 500కుపైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఒక్కో ఇరాన్ డ్రోన్‌‌ను కూల్చేందుకు దానికంటే 106 రెట్లు ఖరీదైన అమెరికా ఇంటర్‌‌సెప్టర్‌‌ మిసైల్స్ ను వాడాల్సి వస్తున్నది.

  • నిధుల కోసం వైట్​హౌస్​కు పెంటగాన్ అభ్యర్థన

ఇరాన్ యుద్ధం, ఇతర అవసరాల కోసం 20 వేల కోట్ల డాలర్ల అదనపు నిధులు కావాలని పెంటగాన్.. వైట్ హౌస్‌‌కు అభ్యర్థన పంపింది. 2027 ఏడాదికి ఉద్దేశించిన పెంటగాన్ బడ్జెట్‌‌కు అదనంగా ఈ మొత్తం అడుగుతోంది. ఇప్పటి వరకు ఇరాన్‌‌లో 7 వేలకుపైగా టార్గెట్లను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇరాక్, అఫ్గాన్ యుద్ధాలకు ట్రిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. 

వెటరన్ల వైద్య సేవలు, ఆయుధాల రీప్లేస్‌‌మెంట్, దీర్ఘకాలిక కార్యకలాపాల ఖర్చులు కలిస్తే మొత్తం బిల్లు ఇంకా భారీగా పెరుగుతుంది. హార్మూజ్ మూసివేతతో ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 100 డాలర్లు దాటింది. బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే పెంటగాన్ వార్షిక ఖర్చు 
130 కోట్ల డాలర్లు అదనంగా పెరుగుతుంది.