టెర్రరిస్టు గ్రూపులకు అమెరికా ఆయుధాలు

టెర్రరిస్టు గ్రూపులకు అమెరికా ఆయుధాలు

యెమెన్: అమెరికాలో తయారైన అత్యాధునిక ఆయుధాలు టెర్రరిస్టు గ్రూపులకు చేరుతున్నాయని ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆరోపించింది. సంకీర్ణ బలగాలకు అమ్మిన వెపన్స్ యెమెన్ లోని ఉగ్రవాదుల చేతుల్లో పడ్డాయని చెబుతోంది. యెమెన్ అంగట్లో అమెరికా ఆయుధాల అమ్మకాలు విచ్చలవిడిగా జరుతున్నట్లు తమ స్టింగ్ ఆపరేషన్ లో బయటపడిందని పేర్కొంది. వీటిలో ఆర్డినరీ రైఫిల్ నుంచి అత్యాధునిక మిస్సైల్స్ వరకు ఉన్నాయని వివరించింది.

ఎలా చేరుతున్నాయి?

అమెరికాలో తయారైన అత్యాధునిక ఆయుధాలను సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం వేలాది డాలర్లు వెచ్చించి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయుధాల అమ్మకం సందర్భంగా వాటిని దుర్వినియోగం చేయకూడదని, తయారీకి సంబంధించిన పేటెంట్ తమదేనని పేర్కొంటూ యూఎస్ పలు షరతులు విధించింది. వెపన్స్ ను ఇతర సంస్థలకు గానీ, దేశాలకు గానీ అమ్మకూడదనే నిబంధన పెట్టింది. విదేశాలకు అమ్మే ఆయుధాల విషయంలో అగ్రరాజ్యం ఈ షరతులు విధిస్తుంది. వాటిని ఉల్లంఘించడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే, ఈ ఒప్పందాన్ని సౌదీ, యూఏఈ పట్టించుకోవట్లేదు. అమెరికా నుంచి అందుకున్న ఆయుధాలను రహస్యంగా టెర్రరిస్టు గ్రూపులకు అందిస్తున్నాయి. యెమెన్ లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ఉద్దేశంతో పాటు స్థానిక తెగల మద్ధతుకోసం ఈ ఆయుధాలను ఉపయోగించుకుంటున్నాయి. వాటి చేతుల్లోంచి జారిన ఆయుధాలు అంతిమంగా టెర్రరిస్టు గ్రూపులకు చేరుతున్నాయి. ఇరాన్ లోని రెబెల్ గ్రూపులకూ ఈ వెపన్స్ అందుతున్నాయి. ఇలా అమెరికా తయారుచేసిన ఆయుధాలే అటు తిరిగి, ఇటు తిరిగి టెర్రరిస్టుల భుజాల మీదికి చేరి అగ్రరాజ్యం సైనికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.

విచారణ జరుగుతోంది: యూఎస్ ఆర్మీ
తమ ఆయుధాలు టెర్రర్ గ్రూపుల చేతుల్లో పడుతున్నాయనే ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తున్నట్లు అమెరికా ఆర్మీ ఉన్నతాధి కారులు వెల్లడించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా, సౌదీ మధ్య బంధంపై కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే జర్నలిస్ట్​జమాల్ ఖషోగి హత్యపై సౌదీ ప్రభుత్వం పై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎడారి దేశానికి ఆయుధాల ఎగుమతులపై అమెరికా పునరాలోచన చేయనుందనే ప్రచారం సాగుతోంది.