గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి.. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సినిమాలు.. ఎవరీ పార్థో ఘోష్?

గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి.. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సినిమాలు.. ఎవరీ పార్థో ఘోష్?

బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత పార్థో ఘోష్ సోమవారం ఉదయం (జూన్ 9) గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. 

పార్థో మరణ వార్తను నటి రీతుపర్ణ సేన్‌గుప్తా ధృవీకరించారు. సేన్‌గుప్తా మాట్లాడుతూ “మాటల్లో చెప్పలేనంత హృదయ విదారకం. మనం ఒక అసాధారణ ప్రతిభను, దూరదృష్టి గల దర్శకుడిని, దయగల ఆత్మను కోల్పోయాము. పార్థో , మీరు తెరపై సృష్టించిన మాయాజాలానికి మీరు ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. శాంతితో విశ్రాంతి తీసుకోండి” అని ఎమోషనల్ అయింది.

పార్థో మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం పార్థో ఘోష్ ముంబైలోని మాధ్ ఐలాండ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఘోష్ భార్య గౌరీ ఘోష్ ఉన్నారు.

ఎవరీ పార్థో ఘోష్?

ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్ సినిమాలను తెరకెక్కించడంలో పార్థో నిష్ణాతుడు. 100 డేస్, 'అగ్ని సాక్షి' (1996), 'గులాం-ఎ-ముస్తఫా' (1997), 'తీస్రా కౌన్?' (1994), మరియు 'యుగపురుష్' (1998), దలాల్  వంటి చిత్రాలతో.. తనదైన దర్శకత్వ ముద్ర వేసుకున్నాడు. 

తన విలక్షణమైన కథ చెప్పడం ద్వారా ప్రసిద్ధి చెందిన పార్థో ఘోష్, సామాజిక వాస్తవికతను మిళితం చేసే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. పార్థో ఘోష్ 1999-2000 లలో ప్రేక్షకులకు థ్రిల్, ఎమోషన్ మరియు సామాజిక ఆలోచనలకు సంబంధించిన కథలను అందించి.. విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన '100 డేస్ ' మరియు 'అగ్నిసాక్షి' చిత్రాల సీక్వెల్స్‌పై పని చేస్తున్నారు. 

పార్థో సినీ ప్రస్థానం:

పార్థో ఘోష్ ఒక భారతీయ బాలీవుడ్ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఆయన కలకత్తాకు చెందినవాడు. హిందీతో పాటుగా బెంగాలీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఘోష్ మొదట్లో హిందీ సినిమాలో చిన్న చిత్రాలతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు (1985). ఆ తర్వాత తాను దర్శకత్వం వహించిన చిత్రం 100 డేస్ (1991). ఇది సూపర్ హిట్ అయ్యి.. పార్థోకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. 

ఆపై వరుస చిత్రాలను నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తూ రాణిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తన విజయవంతమైన చిత్రాలలో జాకీ ష్రాఫ్ మరియు మాధురీ దీక్షిత్ లతో కలిసి నటించిన 100 డేస్ మరియు మిథున్ చక్రవర్తితో కలిసి నటించిన తీస్రా కౌన్ ఉన్నాయి. ఆయన దలాల్ (1993) మరియు నానా పటేకర్ తో కలిసి నటించిన అగ్ని సాక్షి (1996) చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. అగ్ని సాక్షి సినిమాకి గానూ పార్థో ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు.