బొద్దింకలు డెలివరీ చేసి వేధింపులు!

బొద్దింకలు డెలివరీ చేసి వేధింపులు!

మసాచూసెట్స్: అమెరికాలోని మసాచూసెట్స్​కు చెందిన ఇద్దరు దంపతులపై కక్ష గట్టిన ఈ-–కామర్స్ వెబ్ సైట్ ‘ఈబే’కు చెందిన ఏడుగురు ఉద్యోగులు వారికి నరకం చూపారు. ఒక ఆన్ లైన్ న్యూస్ లెటర్ లో ఈబేకు వ్యతిరేకంగా కథనాలు రాసిన పాపానికి వారిని నానా రకాలుగా వేధించారు. బతికి ఉన్న బొద్దింకలు, సాలె పురుగులతోపాటు ఏకంగా చచ్చిన పందిని సైతం వారి ఇంటికి డెలివరీ చేశారు. శవాలపై ఉంచే పూలదండను, వికారంగా ఉండే పంది మాస్క్ ను, జీవిత భాగస్వామి చనిపోతే ఎలా మనుగడ సాగించాలంటూ రాసిన పుస్తకాన్ని కూడా పంపారు. అంతటితో ఆగకుండా వారి కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి వెంబడించి, వేధిస్తూ భయాందోళనలకు గురి చేశారు.

ఐనా, డేవిడ్ స్టీనర్ అనే ఆ దంపతులపై ఈబే అప్పటి సీనియర్ డైరెక్టర్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ జిమ్ బాగ్, మరో ఆరుగురు సిబ్బంది కలిసి 2019 ఆగస్టు 5 నుంచి 23 మధ్య ఇలా తీవ్రంగా వేధించారు. దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిన తర్వాత ఆ ఏడుగురినీ కంపెనీ ఉద్యోగాల నుంచి తీసేసింది. కోర్టు 2022 సెప్టెంబర్​లో అందరినీ దోషులుగా తేల్చి శిక్షలు విధించింది. ఈ కేసులో తాజాగా ఈబే కంపెనీ సెటిల్మెంట్ చేసుకుంది. బాధితులకు 30 లక్షల డాలర్లు (రూ. 24.86 కోట్లు) పరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించింది.

‘‘ఐనా, డేవిడ్ స్టీనర్ ఆన్ లైన్ న్యూస్ లెటర్ లో రాసిన కథనాల వల్ల ఈబేపై ప్రభావం పడుతుందని, ఫార్చూన్ 500 కంపెనీల జాబితా నుంచి జారిపోయే ప్రమాదం ఉందన్న భయంతోనే వారిని వేధింపులకు గురిచేసినట్లు అంగీకరిస్తూ.. ఉద్యోగుల చర్యలకు ఆ కంపెనీ బాధ్యత వహిస్తూ సెటిల్మెంట్ చేసుకుంది” అని ఎఫ్బీఐ బోస్టన్ డివిజన్ ఆఫీసర్ జోడి కోహెన్ చెప్పారు.