
- టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు
- భూమి చివరి వరకు వేటాడుతామని వెల్లడి
న్యూఢిల్లీ: టెర్రరిస్టులతో పాటు వారికి మద్దతు ఇచ్చే వారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పహల్గాం టెర్రర్అటాక్ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్‌కాల్వ్స్ లౌరెంకోతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు అని అన్నారు. "పహల్గాం టెర్రర్అటాక్కు పాల్పడిన ప్రతి టెర్రరిస్ట్‌ను, వారి మద్దతుదారులను గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తాం. మేము వారిని భూమి చివరి వరకు వెంబడిస్తాం" అని మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. పహల్గాంలోని బైసరన్‌లోయలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) టెర్రరిస్టులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ దాడి చేసిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు పాకిస్తాన్ పౌరులని నిర్ధారించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారీ సరిహద్దును మూసివేసింది. పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లు, ఎక్స్హ్యాండిళ్లపై విస్తృతమైన అణచివేతను ప్రారంభించింది. అలాగే, దౌత్య సంబంధాలనూ తగ్గించింది.