అమిత్‌‌‌‌‌‌‌‌ షా రాజీనామా చేయాల్సిందే: రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్

అమిత్‌‌‌‌‌‌‌‌ షా రాజీనామా చేయాల్సిందే: రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్
  • జంతర్ మంతర్ వద్ద పోలీసుల క్రూరత్వంపై కేంద్ర హోం మంత్రి వివరణ ఇవ్వాలి
  • రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ 
  • అమిత్‌‌‌‌ షా ఎందుకు మాట్లాడడంలేదు.. మీ నోరు ఎవరైనా కుట్టేశారా?
  • మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి ప్రజల ముందు నిలబెడతాం 
  • యాంటీ పేపర్‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌ బిల్లుతో అంకెలు తప్ప మారేదేమీ లేదని కామెంట్​
  • యాంటీ పేపర్​ లీక్​ బిల్లుకు మనుస్మృతికి ఏం సంబంధం: నడ్డా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలపై పోలీసులు సాగించిన క్రూరత్వం, అణచివేతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వివరణ ఇవ్వాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్‌‌ చేశారు.

విద్యార్థులకు ఆయన క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని అన్నారు.  పరీక్షల లీకేజీల నిరోధానికి ఉద్దేశించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026’పై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది.

ఖర్గే మాట్లాడుతూ.. యువత ఉమ్మడిగా వినిపించిన గళం, పార్లమెంట్‌‌లో, ప్రధాని ఇంటి ఎదుట రాహుల్‌‌గాంధీ సహా ప్రతిపక్షాలు చేసిన నిరసనల వల్లే కేంద్రం దిగొచ్చిందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలగింపునకు యువతే కారణమని ఆయన అభినందించారు. తన కుర్చీని కాపాడుకోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 

అంకెలు మార్చడం వల్ల ప్రయోజనం లేదు 
యాంటీ పేపర్‌‌‌‌ లీక్‌‌ బిల్లుతో ఎలాంటి ప్రయోజనమూ లేదని ఖర్గే అన్నారు. ఈ సవరణలు కేవలం పెనాల్టీలు, జైలు శిక్షల అంకెలను మార్చడానికే పరిమితమయ్యాయని విమర్శించారు. భారీ జరిమానాలు, కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినంత మాత్రాన పేపర్ లీకేజీలు ఆగవని ఖర్గే అన్నారు. మోదీ పాలనలో పేపర్ లీకేజీల వల్ల 1.25 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.  

విద్యార్థులపై ఏకే-47 ఎక్కుపెడతారా ? 
విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు సాగించిన దమనకాండను ఖర్గే తీవ్రంగా ఖండించారు. బిహార్‌‌లో స్టూడెంట్లపై ఏకే-47 తుపాకులు ప్రయోగించడం ఏంటని ప్రశ్నించారు. ఆందోళన బాటపట్టిన విద్యార్థులతో చర్చలు జరపడానికి నిరాకరించిన ప్రభుత్వం, వారిపై ‘యాంటీ నేషనల్స్’ అని ముద్ర వేసిందని మండిపడ్డారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల అధిపతులుగా ఆర్‌‌ఎస్‌‌ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తులను నియమిస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలన్నారు.

అమిత్​ షా, మోదీ సభకు ఎందుకు రావడం లేదు ?
పార్లమెంట్‌‌ వేదికగా విద్యార్థుల సమస్యలపై చర్చ నడుస్తుంటే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌‌ షా ఎందుకు సభకు రావడం లేదని ఖర్గే మండిపడ్డారు.

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతపై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీశారు. ‘‘మీరు దేశ హోంమంత్రి. దేశ రాజధాని ఢిల్లీలోనే ఇదంతా జరుగుతోంది. అయినా ఇప్పటివరకు మీరు నోరు మెదపలేదు. ఎవరైనా మీ నోరు కుట్టేశారా?” అని అమిత్‌‌ షాపై ఫైర్‌‌‌‌ అయ్యారు.

‘‘ఒకరోజు మిమ్మల్ని మీ ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి ప్రజల ముందు నిలబెడతాం” అని  హెచ్చరించారు. కాగా, విద్యారంగంలో ‘మనుస్మృతి’ కుల వివక్షను ప్రోత్సహించిందని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపివేశాయి. సభలోని కాంగ్రెస్ సభ్యులు ‘మాఫీ మాఫీ’ అంటూ నినాదాలు చేయగా, ఖర్గేపై బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

యూపీఏ హయాంలో ‘ఎన్టీఏ’ ఎందుకు పెట్టలేదు?: జితేంద్ర సింగ్  
 యాంటీ పేపర్​ లీక్‌‌ సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీకేజీలను నిరోధించేందుకు నేషనల్‌‌ టెస్టింగ్​ ఏజెన్సీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 

యూపీఏ-2 కాలంలో ఒక కీలక కమిటీ ఇచ్చిన సిఫార్సులను కాంగ్రెస్ పూర్తిగా తుంగలో తొక్కింది. ఆనాడు వదిలేసిన అసంపూర్ణ పనిని పూర్తి చేసేందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.