భవిష్యత్తులో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం

భవిష్యత్తులో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం

ప్రధాని మోడీ చొరవతో తెలంగాణ ప్రజల 75 ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోగలిగామన్నారు. భవిష్యత్ లోనూ అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. రజాకార్ల అకృత్యాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా రీసెర్చ్ జరగాలన్నారు. 

సర్దార్ వల్లాభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనమే లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నిజాం సేనలను, రజాకార్లను తరిమికొట్టి ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారన్నారు. విమోచనం అధికారికంగా నిర్వహిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. విమోచనం అనడానికి ఇప్పటికీ చాలా మంది భయపడుతున్నారన్నారు అమిత్ షా. హైదరాబాద్ స్టేట్ లో జరిగిన అకృత్యాలపై డాక్యుమెంటరీ తీసి, దేశమంతా ప్రదర్శించాలన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన విమోచన వజ్రోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. 

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం దగ్గర పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు అమిత్ షా. తర్వాత అక్కడే జాతీయ జెండా ఆవిష్కరించి...పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్నాటక మంత్రి శ్రీరాములు పాల్గొన్నారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. దివ్యాంగులు, పేదల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు అమిత్ షా. అంతకుముందు బేగంపేట్ లోని టూరిజం ప్లాజాలో BJP రాష్ట్రముఖ్యనేతలతో సమావేశమయ్యారు అమిత్ షా. మునుగోడు బైపోల్ పై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు నేతలు చెప్పారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారన్నారు. 

 బేగంపేట్ టూరిజం ప్లాజాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను  బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. రాజకీయ అంశాలపై మాట్లాడలేదని.. క్రీడల అభివృద్ధిపైనే చర్చించామన్నారు. బ్యాడ్మింటన్ లో ఇటీవలి విజయాలపై అమిత్ షా తనను అభినందించారని గోపీచంద్ చెప్పారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం ఈటల తండ్రి మల్లయ్య కన్నుమూశారు. దీంతో షామీర్ పేట్ లోని ఈటల ఇంటికెళ్లిన ఆయన.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈటల రాజేందర్ తో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. మద్యాహ్నం తర్వాత పోలీస్ అకాడమీకి వెళ్లారు అమిత్ షా. అక్కడ పలు  కార్యక్రమాల్లో పాల్గొన్నాక ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.