రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే

రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే
  • పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో త్వరలో జరగునున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందేనని బీజేపీ జాతీయ నేత అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. ఆ దిశలో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థంగా బీఆర్ఎస్–కాంగ్రెస్​ను ఎదుర్కోవాలన్నారు. ఆ దిశలో కావాల్సిన సహకారాన్ని హైకమాండ్ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. 

శనివారం ఢిల్లీ కృష్ణ మీనన్ మార్గ్​లోని షా నివాసంలో రాష్ట్ర నేతలతో  కీలక భేటీ జరిగింది. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, బండి సంజయ్, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేకర్, ఈటల రాజేందర్, సునీల్ బన్సల్ పాల్గొన్నారు. అంతకు ముందు బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్(మల్కాజ్​గిరి), సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి(జహీరాబాద్), లక్ష్మారెడ్డి (రంగారెడ్డి)లను అమిత్​షాకు కిషన్ రెడ్డి పరిచయం చేశారు. తర్వాత రాష్ట్రంలోని తాజా పరిస్థితులను
నేతలు షా కు వివరించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, చేరికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

వర్ష ప్రభావంపై షా ఆరా..

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై అమిత్​షా ఆరా తీశారు. వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, వరదల వల్ల దాదాపు 20 మందికి పైగా మరణించారని నేతలు వివరించారు. రాష్ట్రంలో ప్రజా జీవనాన్ని ఈ వర్షాలు స్తంభింపజేశాయని షా దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికీ చాలా గ్రామాలు ముంపులోనే ఉన్నాయని, చాలా మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని వివరించారు. 

స్పందించిన అమిత్ షా.. నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపాలని హోం శాఖ సెక్రటరీని ఆదేశించారు. రాష్ట్రానికి కేంద్రం అధికారుల బృందాన్ని పంపించాలని ఆదేశించినందుకు షా కు రాష్ట్ర నేతలు కృతజ్ఞతలు తెలిపారు.