కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అంశంపై కమిటీ వేస్తాం: అమిత్ షా

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అంశంపై కమిటీ వేస్తాం: అమిత్ షా

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని అమిత్ షా తెలిపారు. రాజ్యాంగ పద్దతిలో తీర్మానం చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారన్నారు. ఐపీఎస్ నేతృత్వంలో కమిటీ వేస్తామని చెప్పారు. ప్రతి రాష్ట్రం నుంచి ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తామన్నారు. శాంతిభద్రతల సమస్యను పరిశీలించడానికి సీనియర్ పోలీసు అధికారిని నియమిస్తామన్నారు. తద్వారా రెండు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు, వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేసే వారిపై.. పోలీసు కేసులు నమోదు చేస్తామని షా స్పష్టం చేశారు. 

రాజ్యాంగ నిబంధనలు అనుసరించి రెండు రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పుతామని అమిత్ షా అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని ఇరు రాష్ట్రాల ప్రతిపక్షాలను ఆయన కోరారు. రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరూ మాట్లాడొద్దన్నారు. ఇందుకు కాంగ్రెస్, ఉద్దవ్ థాక్రే వర్గం సహకరించాలని అమిత్ షా కోరారు. 

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్ కోట్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాలు తమకు సరైన ప్రాథమిక సౌకర్యాలు లేవని.. తమను కర్ణాటక ప్రాంతంలో కలపాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై ప్రస్తావించడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే పూణేలోని కర్ణాటక నెంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ బస్సుపై శివసేన వర్గం దాడికి పాల్పడింది. దీంతో కర్ణాటక బెలగావిలో మహారాష్ట్ర లారీపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే..1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే కొనసాగుతోంది.