
ఎల్బీనగర్, వెలుగు: రెవెన్యూ ఆఫీసర్లమంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు రిపోర్టర్లను నాగోల్ పోలీసులు అరెస్ట్చేశారు. సీఐ మక్బుల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్ నగర్ గడ్డిఅన్నారం ప్రాంతానికి చెందిన రాచకొండ సతీశ్, శ్యామకూరి శివగౌడ్ అలియాస్ శివ, దామెర నాగ ఫణీంద్ర అలియాస్ ఫణి ఓ ఛానల్, న్యూస్పేపర్లో రిపోర్టర్లుగా పని చేస్తున్నారు.
ఎల్బీనగర్, నాగోల్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో బోర్లు వేస్తున్న వ్యక్తులను తాము రెవెన్యూ అఫీసర్లమంటూ బెదిరించి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ఏప్రిల్ 19న ఫతుల్లాగూడ ధనలక్ష్మి కాలనీలో పవన్ తన ప్లాట్లో బోరు వేయిస్తుండగా అతన్ని బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేశారు. చివరికి పవన్రూ.12 వేలు శివకు గూగుల్ పే చేశాడు. అనంతరం బాధితుడు ఉప్పల్ తహసీల్దార్ వాణిరెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆమె పోలీసులను సంప్రదించడంతో ముగ్గురు నిందితులపై కేసు నమోదైంది. మంగళవారం సతీశ్, శివను అరెస్ట్చేశారు. ఈ కేసులో మరో నిందితుడు ఫణి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు సమాచారం.