సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టూడెంట్ ఆన్సర్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టూడెంట్ ఆన్సర్
  •     బిర్యానీలు, మందుబాటిళ్లు, చీరలు పంచుతారు
  •    సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ఏడో తరగతి  స్టూడెంట్ ​ఆన్సర్​


హైదరాబాద్, వెలుగు ​: ‘ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి?’ ఇటీవల జరిగిన ఏడో తరగతి సోషల్​ స్టడీస్ ​ఆన్యువల్​ ఎగ్జామ్​లో అడిగిన ప్రశ్న ఇది. దీనికి ఓ స్టూడెంట్​ రాసిన ఆన్సర్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఎమ్మెల్యే క్యాండిడేట్లు తాము ఎన్నికల్లో గెలిచేందుకు ఇల్లిల్లూ తిరిగి ఓటుకింత అని డబ్బులు పంచుతారని, మగవాళ్లకు బిర్యానీలు,  మందుబాటిళ్లు, మహిళలకు చీరలు కానుకలుగా ఇస్తారని ఆ పిల్లవాడు ఆన్సర్​ రాశాడు. నేటి ఎన్నికల రాజకీయాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ ఆన్సర్​ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. బుక్​లో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు ఎలా జరుగుతాయో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ , టీచర్​ ఆ పాఠాన్ని చెప్పినప్పటికీ స్టూడెంట్​ మాత్రం బయట తాను స్వయంగా చూసిన విషయాన్ని ఉన్నదున్నట్లు రాశాడు. చైల్డ్​ సైకాలజీలో ‘ప్రత్యక్ష అనుభవం’ కిందికి వచ్చే ఇలాంటి ఘటనలు చిన్నారుల లేత మనస్సులపై చెరగని ముద్ర వేస్తాయని, ఆన్సర్​లోనూ అదే కనిపించిందని ఓ సైకాలజిస్టు విశ్లేషించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సర్పంచులు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ఓటర్లకు డబ్బు, మందు, బిర్యానీ, చీరలు లాంటి కానుకలు పంచుతున్నారని, ఫలితంగా రేపటి పౌరుల దృష్టిలోనూ ఓటు విలువ ఇప్పటికే దిగజారిపోయిందని, ఇకనైనా లీడర్లు ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కాగా, రంగారెడ్డి జిల్లా షాబాద్​ మండలంలోని ఓ పాఠశాలకు చెందిన స్టూడెంట్​ఈ ఆన్సర్​ రాసినట్లు తెలుస్తుండగా, మారిన ఎవాల్యుయేషన్​ నిబంధనల ప్రకారం అక్కడి టీచర్ 4 మార్కులు వేయడం గమనార్హం. 

స్టూడెంట్​ రాసిన ఆన్సర్​ ఉన్నది ఉన్నట్లు.. 

‘ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని చెప్తారు. ప్రచారం చేస్తారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైసలు ఇస్తారు. బిర్యానీలు, మందు బాటిల్స్, ​ఆడవాళ్లకు చీరలు ఇస్తారు. ఎలక్షన్లలో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు.’ 

బడి పిల్లలకు కూడా అర్థమైంది : దాసోజు శ్రవణ్​

హైదరాబాద్ : దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు బడి పిల్లలకు కూడా పూర్తిగా అర్థమైందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు   స్కూల్ స్టూడెంట్ రాసిన సమాధానాన్ని ఆయన ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు. దేశంలో అన్ని రకాల అవినీతి, మోసాలకు మూలం ప్రజాప్రతినిధుల ఎన్నికలు అనే విషయం స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా తెలుసుకున్నారన్నారు. రాజకీయాల్లో అవినీతి నేతల వల్లే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని, రాజ్యాంగ విలువలకు సైతం చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.