- 2025లో రాష్ట్రంలో కొత్తగా 53 వేల క్యాన్సర్ కేసులు, 29 వేల మరణాలు
- రోజుకు సగటున 147 మందికి క్యాన్సర్ ఎటాక్, 80 మంది మృతి
- ఐసీఎంఆర్, ఎన్సీఆర్బీ అంచనాలను రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
- కలుషిత నీరు, ఫ్యాక్టరీ వ్యర్థాలు, పురుగు మందులతో పేగు క్యాన్సర్లు: ఐసీఎంఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా సైలెంట్‌గా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నది. రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒకరు కొత్తగా క్యాన్సర్ బారిన పడుతుండగా.. ప్రతి 20 నిమిషాలకు ఒకరు ఈ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదులుతున్నారు. 2025 లో రాష్ట్రంలో ఏకంగా 53,565 కొత్త క్యాన్సర్ కేసులు నమోదుకావడంతో పాటు 29,300 మంది మరణించారంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్), నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) అందించిన అంచనా లెక్కలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గతేడాది దేశవ్యాప్తంగా 15.69 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 8.68 లక్షల మరణాలు నమోదయినట్లు పేర్కొంది. నమోదవుతున్న కేసుల సంఖ్యలో మరణాల సంఖ్య సగానికి పైనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
ఏటా పెరుగుతున్న కేసులు, మరణాలు..
కేంద్రం వెల్లడించిన ఐదేండ్ల అంచనా లెక్కలను పరిశీలిస్తే.. ఏటా క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలో 2021లో 48,775గా ఉన్న కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ 2025 నాటికి 53,565 కు చేరుకుంది. ఇక 2021లో క్యాన్సర్ వల్ల 26,681 మంది ప్రాణాలు కోల్పోగా... ఆ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ 2025 నాటికి 29,300కు చేరినట్లు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఐదేండ్ల కాలంలోనే అటు కేసులు, ఇటు మరణాలు దాదాపు 10 శాతం మేర పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడం, అవగాహన లోపం వల్ల ఈ మరణాల గ్రాఫ్ ఏటికేడు పైకి ఎగబాకుతున్నది.
కలుషిత నీరు.. దురలవాట్లు
క్యాన్సర్ ఇంతలా పంజా విసరడానికి ప్రధాన కారణం మనం తాగే నీళ్లేనని ఐసీఎంఆర్ తన తాజా రిపోర్టులో స్పష్టం చేసింది. ఫ్యాక్టరీల నుంచి ఎలాంటి ట్రీట్‌మెంట్ లేకుండా వదిలేస్తున్న ప్రమాదకరమైన రసాయనాలు, ఫార్మా కంపెనీల వ్యర్థాలు, వ్యవసాయంలో వాడుతున్న పెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ నేరుగా భూమిలోకి ఇంకిపోయి చెరువులు, గ్రౌండ్ వాటర్ విషంగా మారుతున్నాయని, ఆ కలుషిత నీళ్లను తాగడం వల్లే జనాలకు రెక్టల్, కొలొరెక్టల్ (పేగు) క్యాన్సర్లు వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
దీనికి తోడు గుట్కాలు, పాన్ మసాలాలు నమలడం, సిగరెట్లు, మందు తాగడం వల్ల నోటి, లంగ్ క్యాన్సర్లు వస్తుండగా.. కల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం తదితర కారణాలతో మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. 2025 అంచనాల ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే 7,084 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడగా, 3,046 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 3,233 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడగా, 1,746 మంది మరణించారు. ఇక అండాశయ క్యాన్సర్ కేసులు కూడా 1,365 నమోదుకావడం గమనార్హం. మొత్తంగా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి అంతా కలుషితం అయిపోవడమే ఈ క్యాన్సర్ మహమ్మారి విజృంభించడానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఇక నోటిఫైడ్ డిసీజ్‌గా క్యాన్సర్...
క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో నివారణపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో క్యాన్సర్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని, క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించింది. వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ క్యాన్సర్ రిజిస్ట్రీ, నోటిఫైడ్ డీసీజ్ గా ప్రకటించే ప్రక్రియ పూర్తి చేసి నివారణకు చర్యలు తీసుకోనుంది.
ఇలా చేయడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో నమోదయ్యే ప్రతి క్యాన్సర్ కేసు వివరాలు నేరుగా ప్రభుత్వానికి చేరుతాయి. తద్వారా ఏ ప్రాంతంలో ఏ క్యాన్సర్ ఎక్కువుందో గుర్తించి, అక్కడి జనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కీమో థెరపీ సేవలు అందిస్తున్నది. రాష్ట్రంలో మరో నాలుగు క్యాన్సర్ రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
