
తనకు ఓటేస్తే నియోజికవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరుకీ పది లీటర్ల స్వచ్ఛమైన బ్రాండీని ఫ్రీగా ఇస్తానని హామీ ఇచ్చాడు ఓ ఎంపీ అభ్యర్ధి. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ నియోజికవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న షేక్ దావుద్ అనే వ్యక్తి ఆ నియోజక వర్గ ప్రజలకు హామీల వర్షం కురిపించాడు. మామూలుగా అయితే ఏ అభ్యర్ధి అయినా.. ఉచిత పథకాలు అందజేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం అని ఇలా రకరకాల వాగ్ధానాలు చేస్తారు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోయే దావుద్ మాత్రం తనను ఎంపీగా గెలిపిస్తే.. నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, మహిళలకు కావల్సినంత బంగారం అందుబాటు ధరలో ఉండేలా చూసుకుంటానని మాట ఇచ్చాడు. అంతే కాదు.. పెళ్లి చేసుకునే నవవధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ ఆర్థిక భరోసాగా రూ.25000 ఇస్తానంటూ హామీల వర్షం కురిపించాడు.
ఇతగాడి ప్రకటనలతో నియోజక వర్గ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మందుబాబులు మాత్రం తమకిష్టమైన బ్రాండీ కోసమైన ఓటేయాల్సిందేనని అంటున్నారు. ఇదిలా ఉంటే సదరు ఎంపీ అభ్యర్ధి షేక్ దావుద్‌కు ఆశ్చర్యకరంగా 15 మంది నామినీలు లోక్‌సభ ఎన్నికలకు రికమెండ్ చేయడం విశేషం. ఒకవేళ అదృష్ట వశాత్తు దావుద్ గెలిస్తే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో.? లేదో.? వేచి చూడాలి.