గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను సెప్టెంబర్ 5న సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలించేందుకు ఓ ముఠా ప్లాన్ వేసింది. 

ఇందుకు అనుగుణంగా నగరంలోకి వారు ఎంటర్ అయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారంతో కొల్లూరు ఓఆర్ఆర్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు. అనంతరం కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి రూ.35 లక్షల విలువ చేసే 125 కిలోల గంజాయి, కారు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా..మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

మహారాష్ట్రకు చెందిన కార్తిక్ రవి కిరణ్(24), కమల్ సంజయ్(23), రాజభాయ్ లు గంజాయి సరఫరా భాగస్వాములుగా ఉన్నారు. విజయనగరానికి చెందిన రాజా నుంచి వీరు గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.