కర్రలతో కొట్టి వృద్ధుడి హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

కర్రలతో కొట్టి వృద్ధుడి హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యారు. మున్సిపాలిటీలోని కందవాడ వార్డుకు చెందిన కరుణాకర్ అలియాస్ కర్ణయ్య(60) చెత్త సేకరిస్తూ జీవనం గడిపేవాడు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కర్ణయ్యను కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం డెడ్​బాడీని తీసుకెళ్లి చేవెళ్లలోని వేంకటేశ్వరస్వామి గుండంలో పడేశారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న ఏసీపీ కిషన్, సీఐ భూపాల్ శ్రీధర్, డీఐ ఉపేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు.

అనుమానాస్పదంగా మరొకరు..

చేవెళ్లలో మరో ఘటనలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శంకర్‌‌‌‌పల్లి మండలం పరివేద గ్రామానికి చెందిన నారెగూడం కృష్ణ(35) చేవెళ్లలోని చంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటూ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చెల్లాపూర్​లో భూ తగాదాలతో..

తొగుట(దుబ్బాక): సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో శుక్రవారం భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చెల్లాపూర్‌‌‌‌కు చెందిన వంగ బాల్‌‌‌‌రెడ్డికి గ్రామంలో కొందరితో భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పొలానికి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. గ్రామానికి చెందిన రేణుక రెడ్డి, సోనూరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ రాజేశ్​ పరిశీలించారు. హత్య అనంతరం అనుమానితులు దుబ్బాక పోలీస్​స్టేషన్​లో లొంగిపోయినట్లు సమాచారం.