యాదాద్రి, వెలుగు: తన ఆస్తిని తీసుకొని చేతకాని వయసులో కోడళ్లు చూడడం లేదని కలెక్టర్ హనుమంతరావుకు వృద్ధురాలు సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. యాదాద్రి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణికి గుండాల మండలం రామారం గ్రామానికి చెందిన సుగుణమ్మ వచ్చారు. తన భర్త అంజయ్య, ముగ్గురు కొడుకులు చనిపోయారని, వారు మరణించిన తర్వాత భర్త అంజయ్య, తన పేరుతో ఉన్న మూడు ఎకరాలకు పైబడిన భూమిని ముగ్గురు కోడళ్లు తీసుకున్నారని చెప్పారు.
చేతకాని స్థితిలో ఉన్న తన బాగోగులు చూడకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని కంప్లైంట్ చేసింది. తనకు న్యాయం చేసి, భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కోరారు. స్పందించిన కలెక్టర్ హనుమంతరావు తహసీల్దార్‌తో మాట్లాడి.. భూమిని వెంటనే సుగుణమ్మ పేరుతో పట్టా చేయించాలని ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
అడిషనల్ కలెక్టర్ భాస్కరరావుతో కలిసి ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 52 ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఫార్వర్డ్ చేశారు. ఈ సందర్భంగా వలిగొండ తహసీల్దార్‌పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్‌వో జయమ్మ, డీఆర్డీవో నాగిరెడ్డి ఉన్నారు.
