చైనాతో సంబంధాలు మెరుగైతే ఇండియాకు మేలే

చైనాతో సంబంధాలు మెరుగైతే  ఇండియాకు మేలే
  • ఎరువులు, రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌‌‌‌‌‌‌‌ వంటి వాటిపై తొలగనున్న రిస్ట్రిక్షన్లు
  • ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుంజుకోనున్న ప్రొడక్షన్ 
  • చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలు తొలగితే, భారీగా ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐలు వచ్చే అవకాశం
  • జాయింట్ వెంచర్ల ఏర్పాటుతో ఇండియాలో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊపు

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండడంతో ఇండియన్ కంపెనీలు ఎక్కువగా లాభపడతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. రా మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌, ఫార్మా ఇంటర్మీడియేట్ల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నా, ఇండియాలో ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల ఉత్పత్తి ఊపందుకుంటుందని చెబుతున్నారు.   షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌‌‌‌‌‌‌‌సీఓ) సమ్మిట్ సందర్భంగా తియాంజిన్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌‌‌‌‌‌‌పింగ్‌‌‌‌‌‌‌‌ సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు దేశాలు వాణిజ్య భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి.  ద్వైపాక్షిక సంబంధాలు  తిరిగా గాడిలో పడితే  ఇండియన్ కంపెనీలు ఎదుర్కొంటున్న సప్లయ్ సమస్యలు తీరుతాయి. 

ఈ కింద సెక్టార్లకు ఊరట..

భారత్, -చైనా సంబంధాలు మెరుగుపడితే  ఎరువులు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, విదేశీ పెట్టుబడుల రంగాల్లో కొత్త  అవకాశాలు క్రియేట్ అవుతాయి.  ఇదే సమయంలో, అమెరికా  50 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌లు విధించడంతో ఇండియా  తన వాణిజ్య మార్గాలను విస్తరించేందుకు వీలుంటుంది. 
    
డీఏపీ ఎరువులు, రేర్ ఎర్త్ మాగ్నెట్లు, టన్నెల్ బోరింగ్ మెషిన్లపై చైనా ఇటీవల ఎగుమతి ఆంక్షలు తొలగించింది. అయితే అక్టోబర్ నుంచి మళ్లీ ప్రత్యేక ఎరువులపై ఆంక్షలు విధించనుందని సమాచారం. భారత్ 95శాతం వరకు చైనా ఎరువులపై ఆధారపడుతోంది. గత ఆంక్షలతో ధరలు 40శాతం పెరిగాయి.  తద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారు.
    
మోటార్లు, బ్యాటరీలు, అధునాతన ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన రేర్ ఎర్త్ మాగ్నెట్లపై చైనా ఆంక్షలు విధించడంతో, భారత ఆటో, ఎలక్ట్రానిక్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సరఫరాలో ఇబ్బందుల  వల్ల ఉత్పత్తి  మందగించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే వీటి సప్లయ్‌‌‌‌‌‌‌‌లో అంతరాయాలు తొలుగుతాయి. 
    
చైనా సరఫరాదారులతో జాయింట్ వెంచర్లు, టెక్నాలజీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ ఒప్పందాలు కుదుర్చుకొని ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచాలని  భారత్ చూస్తోంది.  ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) లు, డిస్‌‌‌‌‌‌‌‌ప్లే మాడ్యూల్స్, కెమెరా అసెంబ్లీలు, బ్యాటరీల తయారీలో  ఈ భాగస్వామ్యాలు కీలకంగా మారుతాయి. 
    
పెన్సిల్ లెడ్స్, సెలొఫేన్ టేప్, వెయింగ్ మెషిన్లు, చక్రాలు, యాక్సిల్స్‌‌‌‌‌‌‌‌ వంటి  రైల్వే భాగాల  దిగుమతుల్లో   90శాతం పైగా చైనా నుంచి వస్తున్నాయి.  కొవిడ్ తర్వాత లైటర్లు, నగల బాక్సులు వంటి కన్స్యూమర్ ఉత్పత్తుల్లో కూడా అధికంగా  ఆధారపడుతున్నాం. వీటి సరఫరాలో అంతరాయాలు తొలుగుతాయి. 
    
2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత  చైనా పెట్టుబడులపై ఇండియా  నియంత్రణలు పెట్టింది. ఇప్పుడు 24శాతం వాటా వరకు ఇన్వెస్ట్ చేయడానికి చైనీస్ కంపెనీలకు  డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా అనుమతి ఇచ్చే అవసరం ఉంది.  దీనికి సంబంధించిన ప్రతిపాదనను నీతి ఆయోగ్ కేంద్రానికి  అందించింది.
    
2020 నుంచి చైనా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు భారత్‌‌‌‌‌‌‌‌లోకి రాలేకపోవడంతో, నిర్ణయాలు, కంప్లయన్స్ నెమ్మదించాయి.  వివో, ఒప్పో, షియోమి, బీవైడీ  వంటి కంపెనీలు మళ్లీ మేనేజర్లను భారత్‌‌‌‌‌‌‌‌కు పంపేందుకు అవకాశం కలుగుతుంది.

అమెరికాను ఎదుర్కొనేందుకు చైనాతో జట్టు

అమెరికా 50శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌లు విధించడంతో, భారత ఎగుమతిదారులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో, అమెరికా చైనాపై  రిస్ట్రిక్షన్లు తొలగిస్తోంది.  హై-ఎండ్ చిప్ ఎగుమతులపై ఆంక్షలు తొలగించింది. అలానే టారిఫ్‌‌‌‌‌‌‌‌ల అమలుపై పాజ్ ఇచ్చింది. అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌లను ఎదుర్కోవడంలో చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం  మనకు కలిసొస్తుంది.   గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, గత కొన్ని నెలలుగా, సరిహద్దు ఒప్పందాలు, ట్రేడ్‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడం, డైరెక్ట్ ఫ్లైట్స్ వంటి చర్యలతో సంబంధాలను తిరిగి సాధారణ స్థాయికి  వస్తున్నాయి.  భారత్, -చైనా భాగస్వామ్యంలో  కొత్త దశ మొదలయిందని  ఎనలిస్టులు భావిస్తున్నారు.