‘‘దగ్గు మొదలై నెల రోజులైంది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు.’’ ‘‘బైక్ స్టాండ్ వేస్తుంటే కాలికి చిన్న దెబ్బ తగిలింది. కానీ.. వారాలు గడుస్తున్నా గాయం తగ్గడం లేదు.’’ ఇలాంటి మాటలు డాక్టర్లు రోజూ వింటూనే ఉంటారు. దానికి కారణం.. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్. ఇది మనం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎదుర్కొంటున్న సమస్య. బాడీలో ప్రవేశించిన బాక్టీరియా మనం చేసే కొన్ని తప్పుల వల్ల మందులకు లొంగనంత స్ట్రాంగ్‌గా మారుతుంది. అలాంటివాళ్లు ఇన్ఫెక్షన్ల బారినపడితే తగ్గడం అంత ఈజీ కాదు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇంతకీ ఎందుకిలా జరుగుతుంది? బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బ్యాక్టీరియా మందులకు లొంగకపోవడాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. సాధారణంగా న్యుమోనియా నుంచి సర్జరీలు చేసినప్పుడు సోకే ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు కూడా డాక్టర్లు యాంటీబయాటిక్స్‌నే ఇస్తుంటారు. ఒకప్పుడు ఆరోగ్యాన్ని కాపాడడంలో వీటి పాత్ర చాలా ముఖ్యమైంది. కానీ.. అడ్డగోలుగా అవసరానికి మించి వాడడం, అవసరం లేకున్నా తీసుకోవడం వల్ల ప్రజల్లో యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ లేదా ఏఎంఆర్) పెరుగుతూ వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీన్ని ప్రపంచంలోని టాప్ 10 పబ్లిక్ హెల్త్ థ్రెట్స్‌లో ఒకటిగా చేర్చింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) లాంటి సంస్థలు కూడా ప్రజలు ఉపయోగించే కొన్ని మందులు బ్యాక్టీరియా రెసిస్టెన్స్‌ని పెంచుతున్నట్లు చెప్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగి యాంటీబయాటిక్స్ పూర్తిగా విఫలమైతే పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయంటున్నారు డాక్టర్లు. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టమవుతుంది. రోగికి స్ట్రాంగ్ లేదా మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రెసిస్టెన్స్ ఉంది మనిషికి కాదు.. బ్యాక్టీరియాకి మాత్రమే. కాబట్టి డ్రగ్స్ డోసేజీ పెంచినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావొచ్చు.
ఎందుకు పెరుగుతుంది ?
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది సహజ ప్రక్రియే. సాధారణంగా కొన్ని రకాల బ్యాక్టీరియాల జన్యువుల్లో మ్యుటేషన్స్ వల్ల కొన్నాళ్లకు వాటిపై మందులు పనిచేయవు. కానీ, మనుషులు చేసే కొన్ని తప్పులు దీన్ని వేగవంతం చేస్తున్నాయి. మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ ద్వారా రెసిస్టెన్స్ జీన్‌లు ఒక బ్యాక్టీరియా నుంచి మరొకదానికి బదిలీ అవుతాయి.
ట్రీట్‌మెంట్ కష్టమే!
ప్రపంచవ్యాప్తంగా యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ ఒక పెద్ద సవాలుగా మారుతోంది. దీనివల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య కోటికి చేరొచ్చని సైంటిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా ప్రాణాంతకమవుతాయి. ఉదాహరణకు న్యుమోనియా, యూరినరీ ట్రాక్ట్, స్కిన్ ఇన్‌ఫెక్షన్‌లు లాంటివాటికి కూడా చికిత్స చేయడం కష్టమవుతుంది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యంతో డిసేబిలిటీ రావొచ్చు.
కొన్ని సందర్భాల్లో రోగి చనిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సర్జరీలు, సీ–సెక్షన్ లాంటి ప్రొసీజర్‌లలో ఇన్‌ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ విపరీతంగా పెరిగితే డాక్టర్లకు అసలు ట్రీట్‌మెంట్ ఆప్షన్‌లు లేకుండాపోతాయి. అలాంటప్పుడు హైపర్ డోస్ ఇచ్చినా పనిచేయదు. అంతెందుకు యాంటీబయాటిక్స్ పూర్తిగా పనిచేయకుండా పోతే కాలికి తగిలిన చిన్న గాయం వల్ల కూడా ప్రాణాలు పోవచ్చు.
కీమోథెరపీ: క్యాన్సర్ రోగులు ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటున్న వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. దాంతో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తుంటారు. అవి పనిచేయకపోతే ఇన్ఫెక్షన్లు తగ్గవు. క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ చేయడం కూడా కష్టమవుతుంది.
ప్రసవాలు: సీ–సెక్షన్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే గతంలో 2–3 రోజుల్లో నయమయ్యేది. కానీ.. ఇప్పుడు కొందరికి వారాలు గడిచినా తగ్గడం లేదు. కొన్నిసార్లు దీనివల్ల తల్లి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు.. డయాలసిస్, గుండె ఆపరేషన్లు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేయించుకునేవాళ్లలో ఇలాంటి సమస్య పెరుగుతోంది.
అనవసరంగా..
చాలామంది జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లేదా కడుపు నొప్పి లాంటి వాటికి కూడా యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. కానీ, అలాంటివాటికి బ్యాక్టీరియా కారణం కాకపోవచ్చు. అలాంటప్పుడు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా బ్యాక్టీరియా సర్వైవ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అందుకే డాక్టర్ సూచించిన మందులే వాడాలి. అయితే.. డాక్టర్ పది రోజులు వాడమని చెప్తే కొందరు జ్వరం తగ్గింది కదా అని నాలుగు రోజులకే మానేస్తారు. కానీ.. అలా మానేసిన ప్రతిసారీ బ్యాక్టీరియా మరింత బలంగా మారుతుంది. దానివల్ల కూడా సమస్య పెరుగుతుంది. అంతేకాదు.. ఓవర్ ది -కౌంటర్ యాంటీబయాటిక్ అమ్మకాలు, పశువులు, కోళ్లలో యాంటీబయాటిక్ వాడకం పెరగడం, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం పాటించకపోవడం.. లాంటివాటి వల్ల కూడా రెసిస్టెన్స్ పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
బ్యాక్టీరియా రెసిస్టెన్స్‌ని పెంచుకున్నప్పుడు అనేక ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రీట్‌మెంట్ ఇస్తాం. కొన్ని ప్రత్యేకమైన పవర్‌ఫుల్ యాంటీబయాటిక్స్‌ని ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ కాంబినేషన్లు ఇస్తాం. మందులతోపాటు బాక్టీరియోఫేజ్ థెరపీ (బ్యాక్టీరియాను చంపే వైరస్‌లు), యాంటీమైక్రోబయల్ పెప్‌టైడ్స్, ప్రోబయోటిక్స్, రోగనిరోధక శక్తిని పెంచే ట్రీట్‌మెంట్స్ ఇస్తుంటాం. అయితే.. దీని నుంచి బయటపడాలంటే ప్రజలు కూడా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అవసరమైనప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్‌ని వాడాలి.
రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడానికి క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రతను పాటించాలి. యాంటీబయాటిక్స్ తీసకుంటేనే తప్ప తగ్గని ఇన్ఫెక్షన్లు కొన్ని ఉంటాయి. అలాంటివి సోకకుండా టీకాలు వేయించుకోవాలి. సొంతవైద్యానికి దూరంగా ఉండాలి. మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ని ఉపయోగించడం మానుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఫుడ్ తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉపయోగించని యాంటీబయాటిక్స్‌ని సరైన పద్ధతిలో డిస్పోజ్ చేస్తే ఎన్విరాన్‌మెంట్ ద్వారా రెసిస్టెంట్ స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇతరులను కూడా రక్షించొచ్చు.
రిస్క్ ఎవరికి ?
యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ ఎవరిపైన అయినా ఉండొచ్చు. నవజాత శిశువులు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవాళ్లు, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్లు ముందుగా ఎఫెక్ట్ అవుతారు. వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మంచి బ్యాక్టీరియాపై ఎఫెక్ట్
యాంటీబయాటిక్ రెసిస్టెంట్ గట్ మైక్రోబయోమ్‌ని దెబ్బతీసి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దానివల్ల గట్ డైస్బియోసిస్‌కు దారితీస్తుంది. జీవక్రియ, రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, ఊబకాయం, ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. రెసిస్టెన్స్ జీన్స్ గట్ బాక్టీరియాకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మంచి ఫుడ్, ప్రోబయొటిక్స్ తీసుకోవడం ద్వారా గట్ హెల్త్‌ని కాపాడుకోవాలి.
ఫంగల్, వైరస్ రెసిస్టెన్స్
డ్రగ్ రెసిస్టెంట్ పెరిగితే బాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు అనే తేడా లేకుండా అన్నింటికీ మందులను తట్టుకునే సామర్థ్యం పెరగుతుంది. హెచ్‌ఐవీ లేదా ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌ల మీద యాంటీవైరల్ డ్రగ్స్ కొన్నిసార్లు పనిచేయవు. కాండిడా లాంటి ఫంగస్‌లు యాంటీ ఫంగల్ మందులకు లొంగవు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేని రోగుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ?
మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ (ఎంఆర్‌ఎస్‌ఏ) తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. డ్రగ్ రెసిస్టెంట్ మైకోబాక్టీరియంలోట్యూబర్‌క్యులోసిస్ ముఖ్యమైనది. దీనికి ట్రీట్‌మెంట్ ఆప్షన్లు కూడా చాలా తక్కువ. కార్బపెనెం-రెసిస్టెంట్ క్లెబ్సియెల్లా న్యుమోనియా, ఎస్చెరిచియా కోలి.. ఇవి రక్తప్రవాహం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.ఫ్లోరోక్వినోలోన్ రెసిస్టెంట్ సాల్మొనెల్లా టైఫీ తీవ్రమైన టైఫాయిడ్ జ్వరానికి కారణమవుతుంది.
డాక్టర్. కె. కృష్ణ ప్రభాకర్
డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్
