- రాష్ట్ర గీతం కాకుండా పదేండ్లు అడ్డుకున్నరు.. అధికారం శాశ్వతమనుకున్నరు
- ఉద్యమకారులను కనుమరుగు చేద్దామనుకున్నరు: సీఎం రేవంత్రెడ్డి
- రాచరికాన్ని, ఆధిపత్యాన్ని తెలంగాణ ఎన్నటికీ సహించదని వ్యాఖ్య
- పెన్నులపై మన్ను గప్పితే గన్నులై మొలకెత్తుతయని అందెశ్రీ నిరూపించారు
- ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాట లేని మలిదశ ఉద్యమం లేదు
- పదేండ్లు ఆ పాట మూగబోయి ఉండొచ్చు.. కానీ ప్రజాపాలనలో రాష్ట్ర గీతమైంది
- 4 కోట్ల మంది కోరుకున్నట్లే బడుల్లో ప్రార్థనా గీతమైంది.. పాఠంగా మారింది
- గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న, గోరటి వెంకన్న వంటి వారి స్ఫూర్తితోనే ప్రజాపాలన అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘పెన్నులపై మన్ను గప్పితే.. అవి గన్నులై మొలకెత్తుతయ్.. మీ గడీలను కుప్పకూలుస్తయ్’ అనే నినాదాన్ని నిజం చేసి చూపించిన గొప్ప కవి అందెశ్రీ అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. ‘‘అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ పాట లేని తెలంగాణ మలిదశ ఉద్యమం లేదు. నాడు వేదిక ఏదైనా ఆ గీతం వినిపించేది. ప్రతి గుండెలో మార్మోగేది. అలాంటి పాట రాష్ట్ర గీతం కాకుండా స్వరాష్ట్రంలో పదేండ్లు పాలకులు అడ్డుకున్నరు. కుట్రలు పన్నారు” అని ఆయన మండిపడ్డారు.
అధికారం శాశ్వతమని నాటి పాలకులు భావించారని.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవులు, కళాకారులను కనుమరుగు చేసేందుకు ప్రయత్నించారని కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ‘జయ జయహే తెలంగాణ’ పాట రాష్ట్ర గీతమైందని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతున్నాయని తెలిపారు.
తాము అధికారంలో ఉన్నామంటే, ప్రజా ప్రభుత్వం వచ్చిందంటే.. దానికి గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న వంటి ఎందరో మహానుభావుల స్ఫూర్తి, పోరాటమే కారణమని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను ఎప్పటికీ మర్చిపోమని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. శనివారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘అందెశ్రీ సంతాప సభ’ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
రాచరికాన్ని, ఆధిపత్యాన్ని ఈ నేల సహించదు
తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులని సీఎం అన్నారు. ‘‘తెలంగాణ ప్రజలు అహంకారాన్ని, అధిపత్యాన్ని సహించరు. ఉమ్మ డి రాష్ట్రంలో సమైక్యవాదులు ఈ నేలపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు గద్దర్, గూడ అంజన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న పాటలతో నిలదీశారు. తెలంగాణ భూమికి విముక్తి కల్పించాల్సిందేనని తెలంగాణ మలిదశ ఉద్య మానికి బీజం వేశారు” అని ఆయన పేర్కొన్నారు.
రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడల్లా కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారని తెలిపారు. ‘‘నాడు నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి ‘బండెనక బండి కట్టి’ అని గళం విప్పారు. సమైక్య పాలకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా గద్దర్, గూడ అంజన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న వంటి ఎందరో కవులు, కళాకారులు ముందుండి పోరాడారు. తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునా దులు వేశారు” అని గుర్తుచేశారు.
ఎక్కడ ఉద్యమ చరిత్ర తెలుస్తదోననే..!
తెలంగాణ ఉద్యమానికి ‘జయజయహే తెలంగాణ’ గీతం స్ఫూర్తినిచ్చిందని, రాష్ట్రాన్ని సాధించిన ఆ పాట రాష్ట్రగీతంగా అవుతుందని నాలుగు కోట్ల మంది ఆశించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘కానీ, పదేండ్లు ఆ నాటి పాలకుల నిర్ణయాల వల్ల ఆ పాట మూగబోయింది. ఎప్పటికీ మూగబోతుందని వాళ్లు భ్రమపడ్డరు. ఈ గీతం గుండెల్లో ప్రతిధ్వనించినన్ని రోజులు తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిన్రంటే..గద్దరన్న, అందెశ్రీ, గూడ అంజన్న, గోరటి వెంకన్న లాంటి వారు చేసిన్రనే చర్చ వస్తుంది. అందుకే.. ఆ కవుల కవితాగానాలు వినిపిం చొద్దని నాటి పాలకులు కుట్ర చేశారు. పాటను రాష్ట్రగీతం కాకుండా చేశారు.
పదేండ్లు వాళ్ల ఉద్దేశంలో మూగబోయి ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలు నిత్యం పాడుకున్నారు. నేను చేసిందేమీ లేదు.. తెలం గాణ ప్రజలు కోరుకున్నట్లుగా రాష్ట్ర గీతంగా చేసుకు న్నం. బడి ముఖం ఎరుగని అందెశ్రీ రాసిన పాట ఇప్పుడు ప్రతి బడిలో మారుమోగేలా చేసుకున్నాం. పాఠ్య పుస్తకాల్లో మొదటి అంశంగా ఆ గీతం ఉండేలా చేసుకున్నాం. రాష్ట్ర సాధన కోసమే కాదు.. ఇప్పుడు నేను సీఎంగా, మిగతావాళ్లు మంత్రులుగా ఉన్నామంటే అది కేవలం గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న లాంటి ఎందరో కవులు, కళాకారుల స్ఫూర్తి, పోరాటమే కారణం” అని సీఎం పేర్కొన్నారు. కవులు, కళాకారులు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ సాకారమైందని తెలిపారు.
తెలంగాణ చరిత్రలో అందెశ్రీ కోహినూర్ వజ్రం
‘‘అందెశ్రీ నాకు అత్యంత ఆప్తుడు. నా మనసుకు దగ్గరి వారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత. అందెశ్రీ తెలంగాణ ఉద్యమం కోసం సర్వం తాగ్యం చేశారు” అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూరు వజ్రం ప్రత్యేకంమైందని.. అలాగే తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని ఆయన అన్నారు. ‘‘తెలంగాణలో ప్రజాపాలన రావాలని గద్దర్, అందెశ్రీ కోరుకున్నారు. ఇప్పుడు ప్రజాపాలనలో వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు.
అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అందెశ్రీ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. అందెశ్రీ పుస్తకం ‘నిప్పుల వాగు’ను ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది కవులు, కళాకారులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని, భారత్ ప్యూచర్ సిటీలో వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారన్నారు.
