
బడంగ్ పేట్, వెలుగు: చెరువుల సుందరీకరణ పేరుతో జనాన్ని, కాలనీ వాసులను మభ్య పెడుతున్న మంత్రి సబిత కబ్జాలు తప్పా చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం జిల్లెలగూడ మంత్రాల చెరువు దుర్గంధం, గుర్రపు డెక్కతో నిండిపోవటం చూసిన ఆయన మంత్రి సబితా పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువులను కబ్జా చేసిన అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయల కాంట్రాక్టులను దోచి పెట్టారని మండిపడ్డారు. కనీసం గుర్రపు డెక్కను తొలగించలేని దుస్థితిలో మంత్రి ఉండటం సిగ్గు చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్దన్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు గాజుల మధు, సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.