ఓ పాటల కొమ్మ విరిగిపోయింది. కానీ, ఆ కొమ్మ అనుకున్న‘పూ రెమ్మల’ వాసనలు తెలంగాణ అంతటా చుట్టుకునే తిరుగుతున్నాయి. అతడు ఇక్కడి వాగ్గేయకారుల వారసుడు. అందుకే పాటను బతికించాడు. పోతనను ఆదర్శంగా భావించాడు. అందువల్ల పడుపుకూడుపై తిరగబడ్డడు. నేను అమ్మను కొలుస్తానని వాసరేశ్వరి దగ్గరికి వెళ్లి నేనెవరికీ అమ్ముడుపోనని రొమ్ము విరిచి చెప్పుకున్నాడు. పాల్కుర్కిని ఇష్టపడ్డాడు. అందుకే అతడు మాట్లాడినా కవిత్వం చెప్పినట్టే ఉండేది. విఫ్లవకారుల కోసం పుట్టిన గీతాలను తరచి చూశాడు. అందుకే పాటను జీవితంగా మార్చుకున్నాడు. వేద నినాదం గుండెనిండా నింపుకున్నాడు. అందువల్ల జీవితాంతం ‘మనుర్భవ’ మనిషివి కావాలని కోరుకున్నాడు. మనిషి మాయమయ్యాడని మరిగిపోయాడు. మాతృభూమిని బంకించంద్ర చటర్జీలా ప్రేమించాడు. కాబట్టి ‘జయ జయహే’ అంటూ జన్మభూమిని గానం చేశాడు. అతడి నిక్కచ్చితనం నిష్ఠూరం అయినా లక్ష్యపెట్టలేదు. కష్టాలకు భయపడలేదు. వ్యక్తిత్వం వదలి పెట్టలేదు. అవమానాలకు కుంగలేదు.
అరాచకవాదులకు లొంగలేదు. అతడే. అతడే. అవనిని విడిచి వెళ్లిపోయిన అందెశ్రీ!.మట్టి మోసి మాటల మూటలు కట్టిన అక్షర యోధుడు. కూలి నాలి చేసి కవిత్వపు మర్మాలను కై కట్టిన కొత్త కాళిదాసు. జుబ్బకు సంచి కాని అబ్బురపరిచే అక్షరాలను సమకూర్చాడు. తెలంగాణ మలి ఉద్యమంలో తెలంగాణ అంతటా పాటై ప్రవహించాడు. గద్దర్‌ను గుండెకు హత్తుకొంటూనే బిరుదురాజు రమారాజును హృదయంలో ధరించాడు. ‘కులతత్తం’ పట్ల తీవ్ర నిరసన చేస్తూనే నాది సనాతనం అని గర్జించాడు. మావోయిస్టును మహాభారతాన్ని ఏకకాలంలో ప్రేమించాడు. హింసను తూలనాడుతాడు. కర్ణుడిని తలపైకి ఎత్తుకుంటాడు. నాకు ‘సదువు రాదు’ యోగీశ్వరా! అని నాతో అంటాడు. కానీ సాక్షాత్తు ఆదిశంకరుల సౌందర్యలహరికి వ్యాఖ్యానం రాయించి మురిసిపోతాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పార్కుల్లో నడుస్తూ తెలంగాణను దర్శిస్తాడు. ఎక్కడ పాండిత్యం, ప్రతిభ ఉంటే అక్కడికి వెళ్లి ‘బాసర సరస్వతి’గా అర్చిస్తాడు. పాట పదునైన ఆయుధం అనీ అది ఎంటర్టైన్మెంట్కు పనికి వచ్చే పడుపుగత్తె కాదు ‘పాడను పో’ అంటాడు. నియంతలను దించాలని ‘నిప్పుల వాగై’ దుంకుతానని గర్జిస్తాడు. అతడే.. అతడే.. అవనిని విడిచి వెళ్లిపోయిన అందెశ్రీ!
- డా. పి. భాస్కరయోగి
సోషల్ ఎనలిస్ట్
