లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడి

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ దాడి
  • 31 మంది మృతి..149 మందికి గాయాలు

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా గ్రూప్ ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌పై మిసైళ్లతో దాడులకు పాల్పడింది. దాంతో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కూడా లెబనాన్ రాజధాని బీరూట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ప్రతిదాడులకు దిగింది. ఈ దాడుల్లో 31 మంది మరణించగా, 149 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా గ్రూప్ సీనియర్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 

హెజ్‌బొల్లా గ్రూప్ కొత్త చీఫ్ నయీమ్ ఖాసిం తమ తదుపరి లక్ష్యమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. లెబనాన్, ఇరాన్‌లపై ఏకకాలంలో దాడులు జరుపుతున్నామని వెల్లడించారు. ఒకేసారి ఇద్దరి కంటే ఎక్కువ మంది శత్రువుల(మల్టీ-అరేనా సీనారియోకు)తో యుద్ధం చేయడానికి కూడా  సిద్ధంగా ఉన్నామని.. ఏ దిశ నుంచి ఏ దాడి జరిగినా ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని వివరించారు.

దాడులు జరిగిన కొద్దిసేపటికి లెబనాన్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హెజ్‌బొల్లా అక్రమ సైనిక కార్యకలాపాలను నిషేధిస్తున్నదని చెప్పారు. వెంటనే ఆయుధాలను అప్పగించాలని హెజ్‌బొల్లాను డిమాండ్ చేశారు.