ఇరాన్ అణుకేంద్రాలపై వైమానిక దాడులు..! ఆరోపణలను తోసిపుచ్చిన ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ

ఇరాన్ అణుకేంద్రాలపై వైమానిక దాడులు..! ఆరోపణలను తోసిపుచ్చిన ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ

టెహ్రాన్: ఇరాన్‌‌‌‌లోని నటాంజ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా,- ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) లోని ఇరాన్ రాయబారి రెజా నజాఫీ ఆరోపించారు. ఇరాన్‌‌‌‌ను నాశనం చేయడానికి చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ తోసిపుచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలు దెబ్బతిన్నట్టు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. 

ప్రస్తుతం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇరాన్‌‌‌‌లో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నందున రేడియేషన్ లీకేజీని తోసిపుచ్చలేమని వెల్లడించారు. అదే జరిగితే అణు కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించే అవకాశం ఉందని ఐఏఈఏ చీఫ్‌‌‌‌ రాఫెల్ గ్రోసీ వివరించారు.