- ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ పెట్టింది: చంద్రబాబు
- దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు
- మనవాళ్లు అమెరికాలో సెనేటర్లు అవుతున్నారు
- పవన్ తెలంగాణకు వస్తే తప్పేంటని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణలో కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించవద్దని కోరారు. బుధవారం ఏపీ సెక్రటేరియెట్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ రాజకీయ కార్యక్రమాలను, ఆయన సభలను అడ్డుకోవాలని చూడటం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంటుందన్నారు. ఒక నాయకుడు సభ పెట్టకుండా అడ్డుకోవాలని చూడటం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ పాలకులు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. “విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు.
ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఏపీలో కూడా పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు” అని అన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని.. ప్రపంచంలో అన్ని దేశాల్లో మనవాళ్లు పదవులు చేపడుతున్నారని గుర్తుచేశారు. ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో, వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారన్నారు. అనవసర వ్యాఖ్యలు మాని.. అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చంద్రబాబు సూచించారు.
