- నీటి వినియోగం ఆధారంగా 'క్యారీ ఓవర్' నీళ్లను పంచాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బేసిన్లలో నీటి వినియోగం ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని క్యారీ ఓవర్ స్టోరేజీల్లోని నీటిని పంచాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. ఏపీకి 76 శాతం, తెలంగాణకు 24 శాతం నీళ్లివ్వాలని పేర్కొంది. గురువారం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తన వాదనలను కొనసాగించింది. ఉమ్మడి ఏపీలోనే 'గురు రాఘవేంద్ర' స్కీమ్‌ను నిర్మించారని ట్రిబ్యునల్‌కు తెలిపింది. తుంగభద్రలో పూడిక వల్ల కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వాడలేకపోతున్నామని, ఆ నీళ్లు రాకపోవడంతో ఆ 6 టీఎంసీలను గురు రాఘవేంద్ర స్కీమ్ నుంచి వాడుతున్నామని చెప్పింది.
తెలంగాణ కూడా ఆర్డీఎస్ దగ్గర వాడలేని నీళ్లను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం దగ్గర వాడుకుంటోందని వివరించింది. ఆర్డీఎస్ రైట్ కెనాల్ కేటాయింపులను కేడబ్ల్యూడీటీ-2 చేసిందని, తుంగభద్ర రైట్ బ్యాంక్ లో-లెవెల్ కెనాల్ కింద కవర్ కాని ప్రాంతాలకు దీని ద్వారా నీళ్లిస్తున్నామని పేర్కొంది. ఆర్డీఎస్‌ను కృష్ణా బోర్డే పర్యవేక్షిస్తోందని, దానిపై ఇదివరకే కమిటీలు వేశారని, 16వ బోర్డు సమావేశంలో ఈ అంశం మినిట్స్‌లో రికార్డ్ అయిందని ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచాలని ఎక్స్‌పర్ట్ కమిటీ చెప్పలేదని, కేవలం ఆ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే చెప్పిందని పేర్కొంది.
కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోనే ఆర్డీఎస్ రిపేర్లను తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. కర్నాటక తమ వాటాలో వాడుకోని నీళ్లు ఎక్కువ ఉన్నాయని, అందుకే ఆ నీటిని కేసీ కెనాల్ నుంచి వాడుకుంటున్నామని తెలిపింది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగా ప్రాజెక్టులను కేవలం పెన్నా బేసిన్ నీళ్లతోనే నిర్వహించలేమని, అందుకే కృష్ణా నీళ్లను తరలించుకుంటున్నామని ఏపీ వాదించింది. తాము 512 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకుంటున్నామని అంటున్నారని, తెలంగాణ కూడా తమకు కేటాయించిన 299 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకున్న సందర్భాలున్నాయని తెలిపింది. కాగా, తుంగభద్ర నీటి వినియోగంపై కేంద్రం వేసిన హైపవర్ కమిటీ డాక్యుమెంట్లను ఏపీ ట్రిబ్యునల్‌కు సమర్పించింది
