కొండాపూర్ లో 42 ఎకరాల భూములపై ఏపీ Vs తెలంగాణ : హైకోర్టులో పోటాపోటీ వాదనలు

కొండాపూర్ లో 42 ఎకరాల భూములపై ఏపీ Vs తెలంగాణ : హైకోర్టులో పోటాపోటీ వాదనలు

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ నడిబొడ్డు కొండాపూర్ ప్రాంతంలో ఉన్న వేల కోట్ల విలువైన భూమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి కారణంగా మారింది. కొండాపూర్‌లోని సుమారు 42.03 ఎకరాల విస్తీర్ణమున్న భూమి విలువ దాదాపు 4వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.

అసలు ఈ వివాదం 2024లో స్టార్ట్ అయ్యింది. కర్నూలుకు చెందిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్‌కు చెందిన ఈ భూమిని.. భూపతి ఎస్టేట్స్ అనే ప్రైవేట్ సంస్థకు తెలంగాణ సర్కార్ బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ కొందరు వ్యక్తులు హైకోర్టులో 20కి పైగా పిటిషన్లు దాఖలు చేశారు. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం కింద ఈ భూమిని ట్రస్ట్‌కు క్రమబద్ధీకరించిందని వారు కోర్టుకు వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన..
ఈ వివాదంలో తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం.. భూమిపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని స్పష్టం చేసింది. 2018లో బాలసాయిబాబా మరణం తర్వాత, ఈ భూమి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖ నియంత్రణలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ భూమిని ఏపీ ప్రభుత్వమే నిర్వహిస్తూ, రక్షణ చర్యలు చేపడుతోంది. అయితే 2023లో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే.. రెవెన్యూ రికార్డుల్లో ట్రస్ట్ పేరును తొలగించి 'భూపతి ఎస్టేట్స్' పేరును చేర్చిందని ఏపీ కోర్టుకు వెల్లడించింది. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఎండోమెంట్ భూములను హైకోర్టు అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడం సాధ్యం కాదని ఏపీ వాధిస్తోంది. ఈ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చట్టం కింద నమోదైనందున.. దీని నిర్వహణ బాధ్యత తమదేనని పేర్కొంది ఏపీ సర్కార్.

ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడంలో ఆలస్యం చేస్తోంది. 2025 డిసెంబర్ 16న జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయడానికి తెలంగాణకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ స్పందించకపోవడంతో.. ఒక్కో పిటిషన్‌కు 5వేల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కూడా ఈ భూమి ఏపీ ఎండోమెంట్ శాఖ పరిధిలోకి వస్తుందని లేఖ ద్వారా ధృవీకరించారు. ఒకవైపు ప్రైవేట్ వ్యక్తుల పిటిషన్లు, మరోవైపు ఏపీ ప్రభుత్వ గట్టి వాదనల మధ్య రూ.4వేల కోట్ల భూవివాదం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్‌లో ఎలాంటి వివరణ ఇస్తుందనే అంశంపైనే ఈ ఖరీదైన ల్యాండ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.