- విభజన చట్టంలో ఇదే విషయాన్ని చెప్పారు..
- కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనలు
- ప్రస్తుతం చేయాల్సిందల్లా ప్రాజెక్టులవారీ కేటాయింపులేనన్న పొరుగు రాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా నికర జలాలను కేటాయించిందని, ఆ కేటాయింపులు అలాగే ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్నారని కృష్ణా ట్రిబ్యునల్ (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు ఏపీ వాదించింది. గంపగుత్త కేటాయింపులంటే ఒక రాష్ట్రానికి కేటాయించిన నీళ్లని, ఆ నీళ్లలో పొరుగు రాష్ట్రానికి వాటా ఉండదని పేర్కొంది. అంటే ఆ రాష్ట్రంలోనే ఆ నీళ్లను వాడుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత గంపగుత్త కేటాయింపులు అనే క్లాజ్ పోయిందని, కాబట్టి విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనలు కొనసాగించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారని, కాబట్టి ప్రాజెక్టులకే కేటాయింపులు జరగాలని వాదించింది.
గంపగుత్త కేటాయింపుల్లో సవరణను కేవలం ‘రాష్ట్రం లోపల’ మాత్రమే చేయాలని పేర్కొంది. నీటి కేటాయింపులను పార్లమెంట్ చేయరాదని తెలంగాణ పేర్కొనడం తప్పని, అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్3, 4 ప్రకారం నీటి కేటాయింపులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ అవార్డుల్లోని నియమాలు, హెల్సింకి, బెర్లిన్ రూల్స్, జాతీయ జల విధానాలు, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, విభజన చట్టాల్లోని నిబంధనల ప్రకారం ఇప్పుడున్న కేటాయింపులను మార్చరాదని పేర్కొంది. బ్రజేశ్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్ 4 కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నదని తెలిపింది. ఒక్కసారి సెటిల్ అయిన జల వివాదాల కేసులను మళ్లీ తెరవరాదని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్4(1) చెబుతున్నదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో తెలంగాణ కూడా లేవనెత్తిందని ఏపీ గుర్తుచేసింది.
