భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా అతిపెద్ద సవాలుగా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఒక చారిత్రాత్మక ముగింపు దశకు చేరుకుంది. 1967లో నక్సల్బరీ గ్రామపు పొలిమేరల్లో మొదలైన ఈ సాయుధ పోరాటం, దండకారణ్యం మీదుగా సాగి, నేడు నిర్ణయాత్మకమైన మలుపు వద్ద నిలిచింది. మావోయిస్టు నేతలంతా దశాబ్దాల సాయుధ పోరాటం అలసటకు గురైన సంకేతంగా కూడా కనిపిస్తోంది. అడవుల్లో జీవితాన్ని గడిపిన నాయకత్వం ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడం చారిత్రాత్మక పరిణామంగా చెప్పాలి. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక నాయకులు లొంగిపోవడం కేవలం వ్యక్తిగత నిర్ణయాలు కాదు. దశాబ్దాల సాయుధ పోరాటం అలసటకు గురైన చరిత్రాత్మక మలుపు. లొంగిపోయిన నేతలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతులు, పునరావాస పథకాలు ‘బుల్లెట్‌కు బదులు బ్యాలెట్’ అనే ప్రజాస్వామ్య మార్గానికి సూచికలుగా నిలుస్తున్నాయి.
భూసంస్కరణల లోపం, గిరిజనులపై నిర్లక్ష్యం, వనరుల దోపిడీ, సామాజిక అసమానతలు.. ఇలాంటి అంశాలే మావోయిస్టు సిద్ధాంతానికి బీజం వేశాయి. 1967లో నక్సల్బరీ ఘటనతో ప్రారంభమైన ఈ ఉద్యమం, ఆ తర్వాతి దశల్లో మార్పులు చెంది 2004లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఐక్యరూపం దాల్చింది. దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో తన ప్రభావాన్ని విస్తరించింది. ప్రారంభ దశలో ‘వర్గపోరాటం’ అనే సిద్ధాంతంతో గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులు బలమైన పట్టు సాధించారు. అయితే, కాలక్రమేణా హింస, మౌలిక వసతుల ధ్వంసం, ప్రజా ప్రతినిధుల హత్యలు వంటి చర్యలు సామాన్య ప్రజల్లో భయాన్ని పెంచాయి. విప్లవం పేరుతో సాగిన హింసాత్మక మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. గత దశాబ్దంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మావోయిస్టులపై బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతం, డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అటవీ ప్రాంతాల్లో రహదారులు, కమ్యూనికేషన్ సదుపాయాల విస్తరణ ఇవి ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బలుగా మారాయి.
రాజకీయాలవైపు అడుగులు
‘సౌత్ ఏసియా టెర్రరిజం పోర్టల్’ వివరాల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు 1700 మంది మావోయిస్టులు హతమయ్యారు, 6,487 మంది అరెస్టయ్యారు, 11,413 మంది లొంగిపోయారు. ఇది ఉద్యమం బలహీనతను స్పష్టంగా సూచిస్తోంది. చత్తీస్‌గఢ్ కేంద్రంగా జరుగుతున్న ఆపరేషన్లలో పలువురు కీలక నాయకులు పట్టుబడ్డారు. గడిచిన పదేళ్లలో భద్రతాదళాల చర్యల్లో 343 మంది మావోయిస్టు నాయకులు చనిపోయారు. వారిలో తొమ్మిది మంది జాతీయస్థాయి నాయకులు, 51 మంది రాష్ట్రస్థాయి నాయకులు ఉన్నారు. మిగిలినవారు స్థానికస్థాయి నాయకులు. ఈ పరిస్థితుల్లో ఏర్పడిన నాయకత్వ వెలితిని మావోయిస్టులు భర్తీ చేసుకోలేకపోతున్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. కొత్త కార్యకర్తలను చేర్చుకోవడంలో కూడా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. లొంగిపోయిన కొందరు మావోయిస్టు నేతలు రాజకీయాల్లోకి రావాలనే సంకేతాలు ఇస్తున్నారు. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ రాజకీయాల్లోకి రావాలని ప్రకటించడంతోపాటు, బడే చొక్కారావు కూడా రాజకీయాల వైపు అడుగులు వేయనున్నారన్న చర్చ జరుగుతోంది. మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తే కొత్తపార్టీ ఏర్పాటు చేస్తారా? లేక ఇప్పటికే ఉన్న పార్టీల్లో చేరతారా? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
చరిత్ర పుటల్లోకి మావోయిస్ట్ ఉద్యమం
మావోయిస్టు ఉద్యమం బలహీనపడటం మాత్రమే సమస్యల పరిష్కారానికి సరిపోదు. ఈ ఉద్యమం పుట్టుకకు కారణమైన సామాజిక, ఆర్థిక అసమానతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. గిరిజనుల భూమి హక్కులు, వనరుల పరిరక్షణ, విద్య, ఆరోగ్య సేవల అందుబాటు వంటి అంశాలు ఇప్పటికీ కీలకంగా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకుండా కేవలం భద్రతా చర్యలతోనే శాశ్వత శాంతి సాధ్యం కాదు. అరణ్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలి. స్థానిక ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. నిర్వాసితులకు సముచిత పునరావాసం కల్పించాలి. అట్టడుగు వర్గాల ఆత్మగౌ రవాన్ని కాపాడే విధానాలు అమలుచేయాలి. ప్రజా స్వామ్య వ్యవస్థలో వారికి నిజమైన భాగస్వామ్యం కల్పించాలి. దండకారణ్యాన్ని ఒకప్పుడు కుదిపేసిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు చరిత్ర పుటల్లోకి జారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా అరణ్యాల్లో సాగిన సాయుధ పోరాటం అనేక ప్రాణాలను బలి తీసుకుంది. అదే సమయంలో గిరిజనులు, అట్టడుగు వర్గాల సమస్యలను దేశదృష్టికి తీసుకువచ్చిన ఉద్యమంగా కూడా ఇది నిలిచింది. అయితే కాలం మారుతోంది. సమాజం మారుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను పరిష్కరించే మార్గాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది.
ప్రజాస్వరం ప్రభావవంతం
నెత్తుటి గాయాల నేల నుంచి శాసనాలను నిర్మించే శాసనసభల వైపు ప్రయాణిస్తేనే ప్రజల కోసం చేస్తున్న ఉద్యమానికి అసలైన అర్థం ఉంటుంది. తుపాకీ శబ్దం కంటే చట్టసభలలో వినిపించే ప్రజాస్వరం మరింత ప్రభావవంతం అవుతుంది. హింసతో సాధించలేని మార్పులను ప్రజాస్వామ్య పంథాలో సాధించే అవకాశం ఉంది. అరణ్యాల్లో సాగిన పోరాటం ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి ప్రవేశిస్తేనే అది ప్రజల ఆశలను నెరవేర్చగలదు. ఆశయం మారాల్సిన అవసరం లేదు. లక్ష్యం కూడా అదే. సమానత్వం, న్యాయం, అట్టడుగు వర్గాల గౌరవం. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే పంథా మాత్రం మారాలి. తుపాకీ బదులు సంప్రదింపులు, హింస బదులు ప్రజాస్వామ్య పోరాటం అవసరం. కాలం చూపిస్తున్న దారి ఇదే. ఈ మార్పును అంగీకరిస్తేనే గత పోరాటానికి సార్థకత చేకూరుతుంది. భవిష్యత్తు శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఒక దశ ముగుస్తోంది. కానీ, ఈ ముగింపు కేవలం భద్రతా విజయగాథగా మిగలకూడదు. అసమానతలను తగ్గించే సార్థక అభివృద్ధి, సమగ్ర న్యాయం, ప్రజాస్వామ్య భాగస్వామ్యం బలోపేతం అయితేనే ఈ అధ్యాయం నిజమైన శాంతి చరిత్రగా నిలుస్తుంది.
- మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్)
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
