ఈఎన్‌‌‌‌సీ అక్రమాస్తులు రూ.200 కోట్లు... ఆర్ అండ్ బీలో అవినీతి అనకొండ

ఈఎన్‌‌‌‌సీ అక్రమాస్తులు రూ.200 కోట్లు... ఆర్ అండ్ బీలో అవినీతి అనకొండ
  • మోహన్‌‌‌‌ నాయక్​ ఇల్లు, 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు 
  • 15 గోల్డ్​ బిస్కెట్లు సహా రెండున్నర కిలోల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం
  • రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంక్  బ్యాలెన్స్‌‌‌‌ సీజ్‌‌‌‌
  • రూ.1.26 కోట్ల గృహోపకరణాలు, రూ.4.44 లక్షల విలువైన ఫారిన్ లిక్కర్‌‌‌‌‌‌‌‌
  • బీఆర్ఎస్​ హయాంలో జరిగిన రోడ్ల నిర్మాణంలో కీలకపాత్ర
  • స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా
  • మోహన్ నాయక్ అరెస్ట్​.. నేడు కోర్టులో హాజరు

‌‌‌‌హైదరాబాద్‌‌‌‌/ నిజామాబాద్​, వెలుగు: ఆర్ అండ్‌‌‌‌ బీ శాఖ ఇంజినీర్ ఇన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ (ఈఎన్సీ) జరుపుల మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌ అవినీతి పుట్ట బద్దలైంది. మియాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసం, నిజామాబాద్‌‌‌‌ సహా మొత్తం 16 ప్రాంతాల్లో  ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన  సోదాల్లో రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. ఇంట్లో 15 గోల్డ్‌‌‌‌ బిస్కెట్లు సహా రెండున్నర కిలోల బంగారం, ఆరు కిలోల వెండి, గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. 

రూ.కోట్లు విలువ చేసే విల్లాలు, ఖరీదైన ప్రాంతాల్లో ఫ్లాట్లు, ప్లాట్లను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. మోహన్ ​నాయక్​ ఇంట్లో చిన్నపాటి బార్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. అందులో రూ.4.44 లక్షలు విలువ చేసే 22 ఫారిన్ లిక్కర్ బాటిల్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. 

అనంతరం అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి బంజారాహిల్స్‌‌‌‌లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌‌‌‌కి తరలించారు. బుధవారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి నివాసంలో హాజరుపరచనున్నారు. అటు నుంచి చంచల్‌‌‌‌గూడ జైలు రిమాండ్‌‌‌‌కు తరలించనున్నారు. 

ఫిర్యాదులతో రంగంలోకి ఏసీబీ.. 

మోహన్ నాయక్‌‌‌‌ అవినీతి, అక్రమాలపై ఏసీబీకి భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో నెల రోజులుగా ఏసీబీ అధికారులు మోహన్‌‌‌‌నాయక్‌‌‌‌ పై ఫోకస్​పెట్టారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కూడబెట్టిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారు. ఆదాయానికి మించి ఆస్తులపై పక్కా ఆధారాలతో మంగళవారం  రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి  నేతృత్వంలో 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమాస్తులను బయటపెట్టారు. 

మియాపూర్‌‌‌‌‌‌‌‌లోని మోహన్ నాయక్‌‌‌‌ నివాసంతో పాటు ఎర్రమంజిల్‌‌‌‌లోని ఆయన కార్యాలయంలో, నిజామాబాద్‌‌‌‌ జిల్లాలోని బంధువులు, బినామీల ఇండ్లలో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మోహన్ నాయక్ ఇండ్లలో రూ. 55 లక్షలు నగదు, 24 క్యారెట్ల 15 గోల్డ్‌‌‌‌ బిస్కెట్లు, రెండు వజ్రాభరణాలు,22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు బినామీల పేరిట ఉన్న వ్యవసాయ భూములు, అపార్ట్‌‌‌‌మెంట్లలో ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, కార్లు సీజ్‌‌‌‌చేశారు.  

నిజామాబాద్​ జిల్లా మోపాల్​ మండలంలోని మోహన్​ నాయక్​ స్వగ్రామం కులాస్​పూర్​ తండాలో ఆయన సొంతింటితోపాటు బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.  నిజామాబాద్​లోని ఆయన బావమరిది, డిప్యూటీ తహసీల్దార్​ ఆనంద్​ ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రూ.కోట్ల విలువగల వ్యవసాయభూములు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. డిచ్​పల్లి మండలం ముల్లంగి, మోపాల్​ మండలం కులాస్​పూర్​-వద్ద 25 ఎకరాల వ్యవసాయభూములు, ఫామ్​హౌస్ ఉన్నట్లు గుర్తించారు. మోహన్​ నాయక్​ భార్య ఇప్పటికే తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన కూడా వాలంటరీ రిటైర్​మెంట్​ తీసుకుని రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున నిజామాబాద్​ రూరల్​ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మోహన్ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడని తండావాసులు చెప్తున్నారు. కాగా, బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బినామీ పేరిట ఉన్న లాకర్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేయడంతో పాటు మరికొన్ని ఆస్తుల వివరాలు సేకరించాల్సి ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మోహన్‌‌‌‌నాయక్‌‌‌‌ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
 

బీఆర్ఎస్​ హయాంలో కీలకపాత్ర.. 

నిజామాబాద్‌‌‌‌ జిల్లా మోపాల్‌‌‌‌ మండలం కులాసపూర్ తాండాకు చెందిన జరుపుల మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌..  హైదరాబాద్‌‌‌‌లోని వాసవి ఇంజనీరింగ్‌‌‌‌ కాలేజ్‌‌‌‌లో బీటెక్‌‌‌‌, కూకట్‌‌‌‌పల్లి జేఎన్‌‌‌‌టీయూలో ఎంటెక్‌‌‌‌ పూర్తి చేశాడు. ఈ విద్యార్హతలతో1995 లో అసిస్టెంట్‌‌‌‌ రీసెర్చ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అనంతరం1996  రోడ్లు, భవనాల శాఖలో  చేరి,  ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌ బీ ఈఈ, డీఈ, ఎస్‌‌‌‌ఈ, చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌గా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. రోడ్డు కాంట్రాక్టర్లతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన మోహన్​రావు,  కావాల్సిన కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కేలా చేయడంతోపాటు బిల్స్ క్లియర్​ చేసేవాడని, ఈ క్రమంలో కమీషన్ల రూపంలో కోట్లకు కోట్లు లంచాలు తీసుకునేవాడనే ఆరోపణలున్నాయి. 

బీఆర్ఎస్​ హయాంలో చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌గా పదోన్నతి పొందిన మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌.. నాటి ప్రభుత్వంలో జరిగిన రోడ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. 2014--–2018 మధ్య రోడ్​ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ రీ కన్​స్ట్రక్షన్​, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ కనెక్టివిటీ పనులను చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ హోదాలో మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌ చేపట్టారు.   రాష్ట్రవ్యాప్తంగా 2,500 కిలోమీటర్లకు పైగా రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి వేల కోట్ల కాంట్రాక్టుల మంజూరుతో పాటు పర్యవేక్షణ చేశారు. 

ఇది చాలదన్నట్లు  హైదరాబాద్‌‌‌‌ రోడ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీసీఎల్‌‌‌‌) ఎండీగా అదనపు బాధ్యతలను నాటి ప్రభుత్వం మోహన్​నాయక్​కే అప్పగించింది. నాలుగేళ్ల పాటు గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో చేపట్టిన వేల కోట్ల రూపాయల పనుల్లో మోహన్​నాయక్​ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్​ పరిధిలో లింక్‌‌‌‌ రోడ్ల నిర్మాణానికి రూ.572.17 కోట్ల అంచనాతో  పనులు ప్రారంభించి, 2023 నాటికి సుమారు రూ.454 కోట్లు  ఖర్చు చేశారు. బడ్జెట్‌‌‌‌తో సంబంధం లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సుమారు రూ.1,500 కోట్ల దాకా రుణాలు సేకరించి, పనులు చేపట్టారని,  ఈ ఖర్చులో  పారదర్శకత లోపించిందని అప్పట్లో ఫోరమ్‌‌‌‌ ఫర్‌‌‌‌ గుడ్‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌, కాగ్‌‌‌‌ నివేదికలు తప్పుపట్టాయి.  అలాగే ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీపీ(స్ట్రాటజిక్​ రోడ్​ డెవలప్​మెంట్ ​ప్రోగ్రా మ్) ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయలను మోహన్ ​నాయక్​ పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి.

ప్రస్తుతానికి బయటపడ్డ మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌ అవినీతి ఆస్తుల వివరాలు 

  • మియాపూర్‌‌‌‌‌‌‌‌లోని నివాసంలో రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంక్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌
  • 15 గోల్డ్‌‌‌‌ బిస్కట్లు సహా రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోల వెండి
  • రూ.1.26 కోట్ల విలువైన గృహోపకరణాలు.రెండు కార్లు, 9 సెల్‌‌‌‌ఫోన్లు, 4 ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు. 
  • నిజామాబాద్‌‌‌‌ జిల్లా  డిచ్‌‌‌‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి.
  • హైదరాబాద్‌‌‌‌ కొంపల్లిలో 3 ఫ్లాట్లు, గచ్చిబౌలిలో 4 ఫ్లాట్లు.
  • బెంగళూర్‌‌‌‌‌‌‌‌లో ఫ్లాట్‌‌‌‌, మియాపూర్‌‌‌‌‌‌‌‌లో రూ.2.20 కోట్లు విలువ చేసే  ట్రిపులెక్స్ విల్లా, నిజామాబాద్‌‌‌‌లో రూ.కోటి విలువ చేసే విల్లా.
  • కూకట్‌‌‌‌పల్లిలో బిల్డింగ్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌.