ఒకప్పుడు ‘చిన్న కుటుంబం– సంతోషకర కుటుంబం’ అనే నినాదం దేశమంతా వినిపించేది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ నినాదాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తే చిన్న కుటుంబాలు కాస్తా మైక్రో కుటుంబాలుగా మారిపోయాయి. కార్పొరేట్ కల్చర్ నేపథ్యంలో అసలు పెండ్లి, సంతానం ఎందుకు? అనే ఆలోచన యువతలో మొదలైంది.
ఇది కేవలం కాలంతోపాటు యువత అభిరుచిలో వచ్చిన మార్పు కాదు. జీవనశైలి, ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక మార్పులు కలిసి తెచ్చిన వాస్తవం. సంతాన ఉత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) అంటే ఒక మహిళ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సూచిక. ఒక దేశ జనాభా దీర్ఘకాలంలో స్థిరంగా ఉండాలంటే ఈ రేటు సుమారు 2.1 ఉండాలి. భారత్‌లో ఈ సంఖ్య క్రమంగా పడిపోతోంది.
1980లలో నాలుగుకుపైగా ఉన్న ఈ సంతానోత్పత్తి రేటు 2000 ప్రాంతంలో నాలుగు నుంచి మూడుకు పడిపోయింది. 2015 నాటికి 2.3కు తగ్గింది. 2020 నాటికి రెండుకు పడిపోయింది. తాజాగా అది 1.9కి చేరింది. అంటే దేశ జనాభా స్థిరత్వానికి అవసరమైన దానికంటే దిగువకు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రేటు ఇంకా తక్కువగా ఉంది. విద్య, ఆరోగ్యం, పట్టణీకరణలో ముందున్న రాష్ట్రాలే ఇప్పుడు ఈ మార్పును ముందుగా అనుభవిస్తున్నాయి. అయితే, ఇది ఒక్కసారిగా జరిగిన మార్పు కాదు.
ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉండటం కుటుంబానికి నిజంగానే బలం. ఎందుకంటే అప్పటి జీవన పరిస్థితులు వేరు. వ్యవసాయాధారిత కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు అంటే ఎక్కువ పని చేతులు. పొలాల్లో పని చేయడానికి, కుటుంబ ఆదాయానికి తోడ్పడడానికి వాళ్లు ఉపయోగపడేవారు. ఆరోగ్య సదుపాయాలు బలంగా లేని రోజుల్లో శిశు మరణాలు కూడా ఎక్కువ. అందుకే ఎక్కువ మంది పిల్లలు ఉండాలనే ఆలోచన ఉండేది. అంతేకాదు వృద్ధాప్యంలో పిల్లలే తల్లిదండ్రులకు ఆధారం.
మారిన ప్రస్తుత పరిస్థితులు
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లల్ని కనడం సమస్య కాదు. వారికి మంచి ఆహారం, విద్య, వైద్య సేవలు అందించి సరిగ్గా పెంచడం పెద్ద చాలెంజ్ అయింది. మంచి స్కూల్, ఫీజులు, బుక్స్, ట్రాన్స్‌పోర్ట్, కోచింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి ఖర్చులన్నీ చూసుకుంటే మధ్యతరగతి కుటుంబం పిల్లల్ని కనడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు పిల్లలను కని వారిని అంతంతమాత్రం భవిష్యత్తు కంటే.. ఒక్కరికి బెస్ట్ భవిష్యత్తు ఇవ్వాలి అనేది ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల ఆలోచన.
దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఆలోచన ఇంకా బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ విద్య మీద ఫోకస్ ఎక్కువ. ఇప్పుడు చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తున్నారు. ఇది ఆర్థిక అవసరం కూడా, వ్యక్తిగత ఎంపిక కూడా. కానీ ఇక్కడే కొత్త ప్రశ్న మొదలవుతోంది. పిల్లల్ని చూసుకునేది ఎవరు? గ్రాండ్‌పేరెంట్స్ సపోర్టు తగ్గింది. ఖర్చులు ఎక్కువ. ఇద్దరు పిల్లలు ఉన్నా భరోసాగా పెంచగలమా అన్న సందేహం సహజమే.
ప్రపంచ దేశాల్లోనూ మార్పులు
మహిళల విద్య, కెరీర్లు పెరగడం సమాజ పురోగతే. కానీ, ఉద్యోగ భద్రత కూడా మరో పెద్ద అంశం. ఈ పరిస్థితుల్లో పిల్లల గురించి నిర్ణయం తీసుకునేప్పుడు లెక్కలు తప్పవు. అందుకే ‘ఎక్కువ మంది పిల్లలు ఉండాలి’ అనే భావన సహజంగానే తగ్గింది. అయితే ఈ ట్రెండ్‌ను పూర్తిగా పాజిటివ్‌గా కూడా చూడలేం. ప్రపంచంలో దీనికి ఉదాహరణలు మనముందే ఉన్నాయి.
జపాన్‌లో సంతాన ఉత్పత్తి రేటు చాలా కాలంగా తక్కువగానే ఉంది. దాని ఫలితంగా వృద్ధుల జనాభా భారీగా పెరిగింది. పని చేసే యువ జనాభా తగ్గిపోయింది. ఆరోగ్య ఖర్చులు పెరిగాయి. కొన్ని గ్రామాలు దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. దక్షిణ కొరియా పరిస్థితి ఇంకా తీవ్రం.
ప్రపంచంలోనే అత్యల్ప సంతాన ఉత్పత్తి రేటుతో ఇబ్బంది పడుతోంది. వివాహాలు తగ్గాయి. యువ వర్క్‌ఫోర్స్ క్షీణిస్తోంది. ప్రభుత్వం భారీ ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఆశించిన ఫలితం రాలేదు. ఎందుకంటే డబ్బు ఇవ్వడం ఒక్కటే పరిష్కారం కాదు. చైనా ఒకప్పుడు వన్ చైల్డ్ పాలసీని అమలు చేసింది. ఇప్పుడు దాని దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది.
ప్రభుత్వాలు చేయాల్సిన పనులు
మన దేశంలో కూడా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఏజింగ్ ట్రెండ్ వైపు కదులుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు కనిపిస్తున్నది.. రేపు దేశమంతా ఎదుర్కొనే పరిస్థితి కావొచ్చు. అయితే పరిష్కారం ఏమిటి? ఎక్కువ పిల్లలు కనండి అని చెప్పడం సరిపోదు. ప్రభుత్వాలు చేయాల్సిన నిర్దిష్ట పనులు ఉన్నాయి. మొదటిగా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలి.
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగితే ప్రైవేట్ విద్యకు అయ్యే ఫీజులు భారం తగ్గుతుంది. పిల్లల విద్య ఖర్చు కుటుంబాలకు భయం కలిగించకూడదు. రెండోది.. చిల్ర్డన్ ఎకో సిస్టమ్ నిర్మించాలి. నగరాల్లో ప్రభుత్వ మద్దతుతో డే కేర్సెంట్లరు, చైల్డ్ కేర్ సపోర్టు అవసరం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలకు ఇది కీలకం. మూడోది..యువ దంపతులకు హౌసింగ్ సపోర్టు అవసరం. నాలుగోది.. ఉమెన్ఫ్రెండ్లీ ఎంప్లాయ్మెంట్రిఫార్మ్స్తప్పనిసరి.
ఐదోది..మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్‌పై ఆర్థిక భరోసా ఉండాలి. వైద్య ఖర్చులు కుటుంబాలను భయపెట్టకూడదు. ఆరోది... ఉద్యోగ భద్రత అత్యంత ముఖ్యం. యువతకు భవిష్యత్తుపై నమ్మకం లేకపోతే కుటుంబాల విస్తరణ గురించి ఆలోచించరు. ఈ చర్చలో ఇంకో జాగ్రత్త అవసరం. మహిళల స్వేచ్ఛను ప్రశ్నించడం, పిల్లలు కనకపోతే వ్యక్తిగతంగా తప్పుపట్టడం సరైంది కాదు.
దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు దేశానికి ఒక హెచ్చరిక చూపిస్తున్నాయి. అభివృద్ధి అంటే కేవలం ఆదాయం పెరగడం కాదు. కుటుంబాలు భరోసాగా జీవించగలగడం కూడా. జీవితం ఖరీదై, భవిష్యత్తు అనిశ్చితంగా మారితే.. సంతాన ఉత్పత్తి రేటు పడిపోవడం సహజం. కాబట్టి ఇది కేవలం జనాభా గణాంకం కాదు. ఆర్థిక, సామాజిక, కుటుంబ సంక్షేమం మధ్య సమతౌల్యం సాధించాలి. లేకపోతే ఒక్క బిడ్డ చాలు అనే ఆలోచన, పిల్లలే వద్దు అనే దశకు వెళ్లడం ఎంతో దూరంలో ఉండకపోవచ్చు.
డేగ కుమార్ సీనియర్ జర్నలిస్ట్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరిగా రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
