- మంత్రి వివేక్ వెంకటస్వామిపై కాంట్రాక్టర్ వ్యాఖ్యలు అర్ధరహితం
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో నేటి ఆర్థిక ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వానిది బాధ్యత కాదని, గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్నాల శ్రీనివాస్ అన్నారు. రామకృష్ణాపూర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 8న మంచిర్యాలలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశంలో క్యాతనపల్లి ఆర్ఓబీ నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల అంశంపై ఓ కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. క్యాతనపల్లి ఆర్ఓబీ పనులకు 2018 ఆగస్టులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచారని, 2019లో భూసేకరణ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారని గుర్తుచేశారు.
2023లో గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. మంత్రి వివేక్ ఆర్ఓబీ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, ల్యాండ్ లూజర్స్ సమస్యలను పరిష్కరించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, పెండింగ్ అంశాలను క్లియర్ చేయించి పనులు వేగంగా పూర్తిచేయించారని తెలిపారు. అయితే బిల్లుల మంజూరు కోసం ప్రయత్నించిన మంత్రిపై కాంట్రాక్టర్ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షురాలు సృజన, ప్రధాన కార్యదర్శి మేకల సురేందర్, ఏల్పుల సత్యనారాయణ, కార్యదర్శులు పి.శ్రీనివాస్, బైర మల్లేశ్ తదితరులుపాల్గొన్నారు.
