వెలుగు ఓపెన్ పేజీ..ఉచిత ప్రయాణం ఒక విప్లవం..78 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణం

వెలుగు ఓపెన్ పేజీ..ఉచిత ప్రయాణం ఒక విప్లవం..78 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2023 డిసెంబర్ 7.  అది  ప్రగతిభవన్  ప్రజాభవన్‌గా మారిన రోజు.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే  రెండు కీలక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వాటిలో ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా, మరొకటి ఆరోగ్యశ్రీ పథకం బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం.  ఆ రోజున ప్రారంభమైన మహాలక్ష్మి ప్రయాణం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రస్తుతం తెలంగాణలో సుమారు 80 శాతం మహిళలకు బస్సు ప్రయాణమే  ప్రధాన రవాణా సాధనంగా ఉంది.  అయితే ఈ పథకం లక్ష్యం కేవలం  ఉచిత ప్రయాణ  సౌకర్యం కల్పించడం మాత్రమేనా?  

ప్రయాణ సబ్సిడీ అమలులో ఉన్న నగరాల్లో ఢిల్లీలో 58 శాతం, హుబ్లీలో 58.5 శాతం, బెంగళూరులో 59.5 శాతం మహిళలు తమ ప్రయాణ ఖర్చుల్లో ఆదా సాధిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కర్ణాటక రాష్ట్రంలో గృహ కార్మికులుగా పనిచేసే అనేక మంది మహిళలు ఈ పథకం అమలుకు ముందు ప్రయాణ ఖర్చుల కారణంగా పనికి వెళ్లలేకపోయిన సందర్భాలు ఉండేవని తేలింది. 

ప్రస్తుతం రవాణా ఖర్చుల భారం లేకుండా ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నామని వారు చెబుతున్నారు. పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఆ ఆదా అయిన మొత్తాన్ని మహిళలు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, చిన్న వ్యాపారాలు,  ఇతర కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే పథకం అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. 

ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నప్పటికీ, సరిపడా బస్సులు లేకపోవడం, రద్దీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడం, భద్రతా సమస్యలు, కొందరు ఆకతాయిల ప్రవర్తన వంటి అంశాలు మహిళల ప్రయాణ అనుభవాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తమిళనాడులోని మదురై జిల్లాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 49 శాతం మహిళలు  ప్రతిరోజూ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తున్నారు. వారిలో 33 శాతం మంది నెలకు రూ.1,000 వరకు ప్రయాణ ఖర్చులను ఆదా చేస్తున్నట్లు వెల్లడైంది. ఆ ఆదాలో సగానికి పైగా విద్య మరియు వైద్య అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు  పరిశోధన నిర్ధారించింది. 

సేవల నాణ్యతపై నిరంతర సమీక్ష నిర్వహించాలి

ఈ పథకం కేవలం ఉచిత ప్రయాణంతో ముగిసిపోయే కార్యక్రమం కాదు.  ఇది మహిళా సాధికారతను పెంపొందించే  సామాజిక పెట్టుబడి.  ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి  కుటుంబాలకు చెందిన మహిళల జీవితాల్లో ఇది సానుకూల మార్పును తీసుకువస్తోంది.  ఉచిత బస్సు పథకం ద్వారా  ప్రయాణ భారం తగ్గడంతో  నగర పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం ప్రయాణించే  వేలాది మంది మహిళలు  గణనీయమైన  పొదుపు చేస్తున్నారు. 

 ఆ పొదుపు వృద్ధుల  వైద్యఖర్చులకు, పిల్లల విద్యకు,  కుటుంబ అవసరాలకు,  స్వయం ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతోంది.  అయితే పథకం అమలై రెండేళ్లు దాటుతున్నా రద్దీ సమయంలో  ఎదురయ్యే  సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు.  గత  దశాబ్దకాలంగా  ప్రభుత్వ రవాణా రంగం ఎదుర్కొన్న నిర్లక్ష్యం ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చు. 

ఈ మంచి ఆలోచన మరింత విజయవంతం కావాలంటే రద్దీ సమయాల్లో అదనపు బస్సులను నడపడం, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వడం, ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడం, సేవల నాణ్యతపై నిరంతర సమీక్ష నిర్వహించడం అవసరం. మహాలక్ష్మి పథకం కేవలం ఉచిత బస్సు ప్రయాణ పథకం కాదు. ఇది మహిళల ఆర్థిక భారం తగ్గించి, వారి స్వావలంబనను పెంపొందించే సామాజిక పెట్టుబడి. సేవల నాణ్యతను మెరుగుపరుస్తూ,  ప్రయాణ సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తే ఈ పథకం తన అసలు లక్ష్యమైన మహిళా సాధికారతను మరింత సమర్థవంతంగా సాధించగలదు.

78 శాతం మహిళల ప్రాధాన్యత బస్సు ప్రయాణానికే 

మహాలక్ష్మి పథకాన్ని కేవలం ఉచిత బస్సు టికెట్‌గా చూడటం సరైన దృక్పథం కాదు.  మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్యం, స్వేచ్ఛాయుత  సంచారానికి  ఇది  ఒక బలమైన వేదికగా  నిలుస్తోంది. వారి హక్కులను కాపాడటంతోపాటు,  వారి సామర్థ్యాన్ని గుర్తించి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ పథకాన్ని చూడాలి.  ప్రతి ఇంటి మహాలక్ష్మి ఎవరిమీదా ఆధారపడకుండా తమ గమ్యాలను చేరుకోవడానికి అవకాశం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.  

నీకోరే అసోసియేట్స్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దాదాపు 78 శాతం మహిళలు  బస్సు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఉచిత బస్సు పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో మహిళల ప్రయాణ ఖర్చులు  గణనీయంగా తగ్గినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పథకం  ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తే భవిష్యత్తులో విధాన రూపకల్పనకు, మహిళా సాధికారత కోసం ఇంకా అనుసరించే ఆలోచనకు  దోహదపడుతుంది.

 అదే అధ్యయనం ప్రకారం నెలకు రూ.25,000 కంటే తక్కువ ఆదాయం పొందే మహిళలు ఇప్పటికీ ప్రధానంగా బస్సు రవాణాపైనే ఆధారపడుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఈ పథకం వారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

- బోరెడ్డి అభ్యుదయ్ రెడ్డి