సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా మెలిగిరిపేట గ్రామ శివారులో మొసళ్ల పిల్లలు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులోని పంట పొలంలో సోమవారం 20కి పైగా మొసళ్ల పిల్లలను గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సుమారు మొసళ్ల పిల్లలతో పాటు 65 గుడ్లను గుర్తించారు.
సమీపంలోని చెరువులు, ఇతర నీటి వనరుల్లో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉండే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నీటి వనరుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది మొసళ్ల పిల్లలను సురక్షితంగా పట్టుకుని మంజీరా నదిలో వదిలిపెట్టారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో మరిన్ని మొసళ్లు ఉన్నాయా అనే విషయంపై అధికారులు నిఘా పెంచారు.
