కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు

కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు
  •  నడవలేని స్థితిలో ఉండడంతో బయటకు వచ్చి సమస్య విన్న ఎస్పీ

మెదక్, వెలుగు : తనకు తెలియకుండా ఇద్దరు కొడుకులు భూమి రాయించుకొని, ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని ఓ వృద్ధుడుసోమవారం మెదక్ ఎస్పీ ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన భద్రయ్య అనే వృద్ధుడు సోమవారం ఎస్పీ ఆఫీస్ కు వచ్చాడు. నడవలేని స్థితిలే వరండాలో కూర్చున్న భద్రయ్యను గమనించిన రిసెప్షన్ సిబ్బంది సరిత విషయాన్ని ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్పీ తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి భద్రయ్యను పలకరించి వివరాలు ఆరా తీశాడు.

 తనకు ఉన్న 36 గుంటల భూమిని తనకు తెలియకుండా కొడుకులు నోముల రాజు, శ్రీనివాస్ అక్రమంగా పట్టా చేసుకున్నారని భద్రయ్య కన్నీటిపర్యంతమయ్యాడు. అలాగే ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయాలని తన కూతురు లావణ్యపై ఒత్తిడి తెస్తున్నారని, తనను సరిగా చూసుకోవడం లేదని, అన్నం కూడా పెట్టడం  లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుడి సమస్య విన్న ఎస్పీ.. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి అతడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎస్సై రంజిత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఫోన్ లో ఆదేశించారు.