కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కొత్త ఊపు.. పెరిగిన పంటల ఉత్పత్తి, కొనుగోళ్లే సాక్ష్యం

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కొత్త ఊపు.. పెరిగిన పంటల ఉత్పత్తి, కొనుగోళ్లే సాక్ష్యం

తెలంగాణ నేల మళ్లీ పచ్చని పంటలతో కళకళలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం సరికొత్త ఊపును అందుకోవడమే కాకుండా, రికార్డు స్థాయి ప్రగతి వైపు అడుగులు వేస్తోంది.

గత ప్రభుత్వ హయాంలోని లోపాలను అధిగమిస్తూ, రైతు కేంద్రీకృత  విధానాలు,  పెరిగిన సాగునీటి లభ్యత,  మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు వెరసి తెలంగాణ వ్యవసాయ రూపురేఖలను మార్చేశాయి. ఏ ప్రభుత్వ విజయానికైనా రైతాంగం చూపే నమ్మకమే అసలైన కొలమానం.

గడిచిన  రెండేళ్ల కాలంలో ఈ నమ్మకం అక్షరాలా అంకెల్లో సాక్షాత్కరిస్తోంది.  కేవలం ఒక వరిసాగు  2022-23 నాటి పరిస్థితులతో పోలిస్తే.. 2025-26 నాటికి రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం దాదాపుగా 15 లక్షల ఎకరాలు పెరగడం సామాన్యమైన విషయం కాదు. అయిదు పంటలను అంటే వరి, మొక్కజొన్న, జొన్న, శనగ, సోయాబీన్ లాంటి పంటల  మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 2022-23లో  295 లక్షల టన్నుల నుంచి 436 లక్షల టన్నులకు చేరి,  ఏకంగా 48 శాతం వృద్ధిని నమోదు చేయడం అద్భుతమైన ప్రగతి.

రాష్ట్రంలో  వరిసాగులో ఈసారి కనీవినీ ఎరుగని రికార్డులు నమోదయ్యాయి. వరి ఉత్పత్తి  2022-–23లో  2 కోట్ల 58 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల 40 లక్షల టన్నులకు పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థకు భారీ ఊతం లభించింది.  పెరిగిన మార్కెట్ సదుపాయాలు రైతులకు మద్దతు ధరను అందించడంలో సఫలమయ్యాయి. ఇక, అన్నింటికంటే ముఖ్యంగా మొక్కజొన్న సాగులో ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది.  గతేడాది కంటే దాదాపు రెండింతల సాగు పెరిగింది. ఉత్పత్తి చూస్తే  2022-–23లో 28.65 లక్షల నుంచి 2025-–26కు వచ్చేసరికి 82 లక్షల  టన్నులకు మొక్కజొన్న ఉత్పత్తి చేరడం వ్యవసాయ వైవిధ్యీకరణకు అద్దం పడుతోంది.

జొన్న పంట ఉత్పత్తి  సైతం గతంతో  పోలిస్తే ఎన్నో రెట్లు పెరగడం గమనార్హం. మొక్క జొన్న కేవలం గత యాసంగిలో 6 లక్షల ఎకరాలు సాగు అయితే ఈ యాసంగిలో 16 లక్షల ఎకరాలు సాగు అయింది.  వ్యవసాయ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నట్లుగా.. ఈ అసాధారణ వృద్ధి అయాచితంగా వచ్చింది కాదు.  ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసిన ప్రణాళికల ఫలితమిది.  సకాలంలో  ఎరువులు,  విత్తనాల పంపిణీ,  సాగునీటి నిర్వహణలో పారదర్శకత, యార్డుల్లో  దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేయడం, వరి పంటకు బోనస్ ఇవ్వడం  వంటి చర్యలు రైతాంగానికి కొండంత అండగా నిలిచాయి.

బీఆర్‌‌ఎస్ కపట కన్నీరు
తెలంగాణ గడ్డపై ఇప్పుడు సాగుతున్నది కేవలం పంటల కొనుగోలు ప్రక్రియ మాత్రమే కాదు.  రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వానికి,  అధికారం కోల్పోయిన ఆక్రోశంతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న సత్య- అసత్యాల యుద్ధం.   రైతాంగాన్ని నట్టేట ముంచిన  గత బీఆర్‌‌ఎస్ నేడు నీతులు మాట్లాడుతుంటే, కేంద్రంలో ఉంటూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపే బీజేపీ ఇక్కడ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. 

గణాంకాలు అబద్ధం చెప్పవు.  కేంద్రం సృష్టించిన అడ్డంకులను అధిగమిస్తూ ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వం రైతన్నకు అందిస్తున్న భరోసాను ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలనతో చూద్దాం.  గత పదేళ్ల బీఆర్‌‌ఎస్   హయాంలో పండిన పంట కంటే, ఇప్పుడు  పండుతున్న పంట చాలా ఎక్కువ అనే  పచ్చి నిజం ప్రతిపక్షాలకు  మింగుడుపడటం లేదు. 

గత  ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి రైతులు పడిగాపులు కాశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి, కల్లాల ముందే మొలకెత్తిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నాటి ప్రభుత్వం ఆ తడిచిన ధాన్యాన్ని కొనేందుకు నిరాకరించి, రైతులను మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మానవతా దృక్పథంతో  తడిచిన ధాన్యాన్ని సైతం వదలకుండా  కొనుగోలు చేస్తాం అని ప్రకటించి ఆచరణలో చూపించింది.

నాడు దోపిడీ, నేడు పారదర్శకత
గత  ప్రభుత్వ కాలంలో  కొనుగోలు కేంద్రాల్లో  తరుగు పేరిట క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు అడ్డగోలు దోపిడీ జరిగేది.   రైతులు గుండెలు బాదుకున్నా ఒక్కనాడూ నాటి మంత్రులుగానీ,   ప్రజాప్రతినిధులుగానీ కొనుగోలు కేంద్రాల వైపు  కన్నెత్తి చూడలేదు.

కొన్న పంటకు కూడా రెండు నెలల వరకు కూడా రైతులకు డబ్బులు ఇవ్వలేని గత పాలకులు  ఈ రోజు  ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు.  ప్రతిపక్షాలు కొనుగోలుపై  విమర్శలు చేసే ముందు అర్థం చేసుకోవాల్సినది  గతంలో ఉత్పత్తి ఎంత, ఇప్పుడు ఎంత అనేది చూసుకొని మాట్లాడితే బాగుంటుంది.

గతం కంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి.  సాగు పెరిగింది.  దిగుబడి పెరిగింది.   రైతులను ఆదుకోవడం కోసం ప్రజా ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తుంటే సహకరించాల్సిందిపోయి రైతులను రెచ్చగొట్టే  ప్రయత్నం చేశారు.  మీ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతుంటే? అడిగితే  రైతులకు బేడీలు వేసి జైల్లో  పెట్టారు,  అనేకమంది రైతుల మీద కేసులు పెట్టిన నీచ చరిత్ర మీది.

బీజేపీ ద్వంద్వ వైఖరి
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉందా? అని రైతులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్ప, కేంద్రం దేశవ్యాప్తంగా రైతాంగానికి  చేస్తున్న మేలు ఏంటి ? బాయిల్డ్ రైస్ (ఉడికించిన బియ్యం)కు పూర్తిస్థాయిలో  కేంద్రం అనుమతి ఇవ్వలేదు.

ఈ సీజన్‌‌లో విపరీతమైన ఎండల కారణంగా ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు  నూకల శాతం ఎక్కువగా వస్తుంది. దీని వల్ల రాష్ట్రంలోని  మిల్లర్లు తీసుకోవడానికి  ముందుకు రాలేని పరిస్థితి.  దీనివల్ల  ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.  మరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌‌కు అనుమతి ఇప్పించకుండానే ఇక్కడి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. పండిన పంటలను పూర్తిగా కొనకుండా రాష్ట్రం మీద వదిలేస్తున్నది కేంద్ర ప్రభుత్వం.

కేంద్రం కొనుగోలు చేస్తున్న పంటలలో  వరిని 70 శాతం మాత్రమే కొనుగోలు చేసి మిగిలింది రాష్ట్రానికి వదిలేస్తోంది. పప్పు దినుసులు, ఆయిల్ సీడ్స్ పంటలు  సోయాబీన్, శనగ, కందులు, పెసర, పొద్దుతిరుగుడు, పల్లీ లాంటి  పంటలను కేవలం 25 శాతం మాత్రమే కేంద్రం తీసుకొని  మిగిలిన పంటలను వదిలేస్తోంది.  మొక్కజొన్న, జొన్న( హైబ్రిడ్)లాంటి  పంటను  కూడా కేంద్రం కొనడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొనుగోలు చేస్తోంది. 

మారిన పాలన- క్షేత్రస్థాయిలో మంత్రులు
నేడు పరిస్థితి పూర్తిగా భిన్నం.  ముఖ్యమంత్రి  ఆదేశాలతో, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ స్వయంగా కొనుగోలు  కేంద్రాల్లో మండుటెండలను  సైతం  లెక్కచేయకుండా  పర్యటిస్తున్నారు. 

తరుగు  దోపిడీని అరికడుతూ, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు తక్షణ చెల్లింపులు జరుపుతున్నారు. 2021-22 యాసంగిలో 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే  ప్రజా ప్రభుత్వంలో  ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది.  ఇది  కొనుగోలు పూర్తి అయ్యేనాటికి 75 లక్షలు దాటవచ్చు అనే అంచనాలు ఉన్నాయి.

తెలంగాణే ఆదర్శం
మొక్కజొన్న పంటను కేవలం ఒక్క తెలంగాణలోనే  ప్రభుత్వం బాధ్యతగా  కొనుగోలు చేస్తోంది.  దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు (మహారాష్ట్ర,  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాలు) ఎక్కడైనా మొక్కజొన్నను ఈ స్థాయిలో  కొంటున్నాయా?   రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో తెలంగాణ రైతు లేడు.

నాడు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూసి ఏడ్చిన రైతును కాపాడింది ఎవరో, నేడు తడిసిన ప్రతి గింజనూ కొంటామని భరోసా ఇచ్చి అండగా నిలిచింది ఎవరో  అన్నదాతకు  బాగా తెలుసు.  ప్రజా ప్రభుత్వ  చిత్తశుద్ధికి,  పెరిగిన సాగు, పెరిగిన ఉత్పత్తి, కొనుగోలు కేంద్రాల్లో పరుగులెడుతున్న ధాన్యపు రాశులే సజీవ సాక్ష్యాలు.  ఇప్పటికైనా  ప్రతిపక్షాలు కపట నాటకాలను పక్కనబెట్టి,  తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి.

రికార్డు సాగు, మొక్కజొన్న కొనుగోళ్లు
ప్రస్తుత ప్రభుత్వం  రైతు అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో పంటసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఉత్పత్తి ఊహించని స్థాయికి చేరింది. గత ప్రభుత్వాలు మొక్కజొన్న రైతులను పూర్తిగా విస్మరించాయి. కానీ, తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుత ప్రభుత్వం మొక్కజొన్నను పెద్ద ఎత్తున మద్దతు ధరతో కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది.

2022-23 యాసంగిలో 2 లక్షల 67 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 2025-26 యాసంగిలో 14 లక్షల 72 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపింది.  సుమారుగా  ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల వరకు రావొచ్చు.

ఈ  ప్రజాప్రభుత్వం. మొక్కజొన్ననేకాదు, జొన్న పంట కూడా 2022–-23లో 37వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 2025-26లో 1.05 లక్షల  మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ఇప్పటి  ప్రభుత్వం.  ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల వరకు రావొచ్చు. పెరిగిన ఉత్పత్తి కారణంగా కొనుగోళ్లలో  కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా, వాటిని తక్షణమే పరిష్కరిస్తూ  సకాలంలో లారీల ఏర్పాటు, గిడ్డంగుల వసతి కల్పిస్తూ  ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది.

అన్వేష్ రెడ్డి సుంకేట చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ

  • ఓపెన్​ పేజీకి  వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరిగా రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.