జపాన్‌లో ఉద్యోగం సాధించడం కష్టం కాదు.. కానీ అక్కడి ఆఫీస్ కల్చర్‌ని అర్థం చేసుకోవడమే అసలైన ఛాలెంజ్. గత 10 ఏళ్లుగా జపాన్‌లో పనిచేస్తున్న భారతీయుడు అంకిత్ పురోహిత్ అక్కడి వర్క్ సంస్కృతి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు.
గత 10 ఏళ్లుగా జపాన్‌లో పనిచేస్తున్న భారతీయుడు అంకిత్ పురోహిత్, అక్కడి వర్క్ కల్చర్ తన జీవితాన్ని ఎలా మార్చిందో పంచుకున్నారు. జపాన్ కంపెనీలు కేవలం వ్యక్తిగత గుర్తింపు కంటే.. అందరూ కలసికట్టుగా పనిచేసే టీమ్‌వర్క్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ పనిని ఏదో త్వరగా పూర్తి చేశామా అని కాకుండా, ఎంతఅచ్చంగా, నాణ్యతతో చేశాం అనేదానికి ఎక్కువ విలువ ఇస్తారు. ప్రతి ఉద్యోగి నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు.
ప్రతి నిమిషం ఓవర్‌టైమ్‌కి జీతం చెల్లించడమే కాదు.. లాగ్ ఆఫ్ అయిన తర్వాత లేదా సెలవు రోజుల్లో మేనేజర్లు ఉద్యోగులను అస్సలు విసిగించరు.ఈ క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం కేవలం ఒక మంచి ఉద్యోగిగా తీర్చిదిద్దడమే కాదు.. ఒక ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి సహాయపడతాయని పురోహిత్ అంటున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు జపాన్ యొక్క క్రమశిక్షణను, ఉద్యోగుల పట్ల వారిచ్చే గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు. అందుకే చాలామంది ఎప్పటికైనా జపాన్‌లో పనిచేయాలని కలలుకంటున్నారు.
ఈ రూల్స్ తప్పనిసరి
- ముఖ్యంగా జపాన్ లో పని ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే.. 9 గంటలకే రావడం కాదు, అంతకంటే ముందే వచ్చి సిద్ధంగా ఉండాలి.
- ఇక్కడ ప్రయాణాన్ని హోదాగా చూడరు. చివరికి కంపెనీ CEOలు కూడా సాధారణ ఉద్యోగులతో పాటు లోకల్ ట్రెయిన్లలోనే ప్రయాణిస్తారు.
- మధ్యాహ్న భోజనం మీ వ్యక్తిగత సమయం. చాలామంది ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోకుండా, స్టోర్లలో దొరికే 'బెంటో బాక్స్' తినడానికే మొగ్గు చూపుతారు.
- లిఫ్ట్ బటన్స్ దగ్గర నిలబడిన వ్యక్తి, అందరూ బయటకు వెళ్లేవరకు తలుపు పట్టుకుని బటన్ నొక్కి ఉంచాలి. చివరికి మాత్రమే తను బయటకు రావాలి.
- ఇక్కడ ప్రతి నిమిషానికి విలువ ఇస్తారు. మీరు కేవలం 15 నిమిషాలు అదనంగా పనిచేసినా.. దానికి కంపెనీ జీతం చెల్లిస్తుంది.
- ఒక్కసారి లాగౌట్ అయ్యారా.. పని ముగిసినట్లే! మేనేజర్లు ఆఫీస్ వేళల తర్వాత లేదా సెలవు రోజుల్లో ఫోన్ చేసి విసిగించరు.
