చైనాకు చెందిన షెన్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని మోసానికి గురయ్యాడు. తక్కువ ధరకు ఇల్లు వస్తుందనే ఆశతో ఆయన కొనుగోలు చేసిన ఒక ఫ్లాట్, అసలు ఆ బిల్డింగ్ లో లేకపోవడం ఇక్కడ అసలు ట్విస్ట్. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్, క్సియాన్ సమీపంలోని ఒక గ్రామంలో 2013లో ఈ వింత ఘటన వెలుగుచూసింది. షెన్ ఏకంగా 34వ అంతస్తులో ఒక ప్లాట్‌ను బుక్ చేసుకున్నాడు. కానీ తీరా చూస్తే ఆ బిల్డింగ్ కేవలం 32 అంతస్తులు మాత్రమే ఉండటంతో షెన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
అసలు కథేంటంటే.. అక్కడ చదరపు మీటరు సగటు మార్కెట్ ధరతో పోలిస్తే కేవలం మూడో వంతు ధరకే అంటే సుమారు రూ.37వేల 431కే లభించడంతో షెన్ 90 చదరపు మీటర్ల ఫ్లాట్‌ను కొనేందుకు ముందుకొచ్చాడు. మొత్తం విలువ దాదాపు రూ.33లక్షల 69వేలుగా తేలింది. దీని కోసం ఆయన 2013లో రూ.16 లక్షలు డౌన్ పేమెంట్‌గా కూడా చెల్లించాడు. అయితే ఇది గ్రామీణ సామూహిక భూముల్లో అక్రమంగా నిర్మించిన లిమిటెడ్ ప్రాపర్టీ రైట్స్ కలిగిన గ్రే-మార్కెట్ ఇల్లు.
ఇలాంటి ప్రాజెక్టులకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, చట్టపరమైన రక్షణలు ఉండవు. కానీ డెవలపర్ మాటలు నమ్మి, భవిష్యత్తులో సర్టిఫికెట్లు వస్తాయనే ఆశతో షెన్ పెట్టుబడి పెట్టాడు. 2015లో ఇల్లు చేతికి రావాల్సి ఉన్నా.. నిర్మాణ ఆలస్యం కారణంగా 2017 వరకు సాగింది. చివరకు బిల్డింగ్ పూర్తయ్యాక చూస్తే అందులో కేవలం 32 అంతస్తులే కట్టారు. దీంతో తాను కొన్న 34వ అంతస్తు గాల్లో కలిసిపోయిందని షెన్‌కు అర్థమైంది.
బిల్డర్ ప్రత్యామ్నాయంగా 32వ అంతస్తులో ఇల్లు ఇస్తానన్నా, మిగిలిన డబ్బు వెంటనే కట్టలేకపోవడంతో ఆ ఫ్లాట్‌ను వేరొకరికి అమ్మేశారు. ఇల్లు పోవడంతో షెన్ తన రిఫండ్ కోసం తిరగడం ప్రారంభించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ బిల్డర్ కాలయాపన చేస్తూ.. 2020లో కొంచెం, 2022లో కొంచెం చొప్పున కేవలం సగం డబ్బు మాత్రమే తిరిగి ఇచ్చి చేతులెత్తేశాడు.
దీనిపై షెన్ ఆర్బిట్రేషన్ ఆశ్రయించగా.. మిగిలిన డబ్బుతో పాటు వడ్డీ, జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా బిల్డర్ దగ్గర ఎలాంటి ఆస్తులు, బ్యాంకు నిల్వలు లేకపోవడంతో ఆ ఆర్డర్ అమలు కావడం కష్టంగా మారింది. ఇల్లు కొని 10ఏళ్లు దాటినా.. నేటికీ షెన్‌కు అటు ఇల్లు రాక, ఇటు పూర్తి డబ్బులు దక్కక నట్టేట మునిగాడు. చట్టపరమైన రక్షణలు లేని చౌక ప్రాపర్టీల వెనుక ఉన్న అసలు ప్రమాదాలను ఈ రియల్ రియల్టీ స్టోరీ ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. సో తక్కువ రేటుకు వస్తోంది అంటే ఒకటికి 10 సార్లు అన్నీ తెలుసుకున్నాకే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల జోలికి వెళ్లటం మంచిదని ఈ స్టోరీ నేర్పిస్తోంది.
