వెలుగు ఓపెన్ పేజీ : విదేశీ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వ వైఫ‌‌ల్యం

వెలుగు ఓపెన్ పేజీ :  విదేశీ వ్యవహారాల్లో  మోదీ ప్రభుత్వ వైఫ‌‌ల్యం

 ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన భారతదేశ  విదేశీ విధానంపై  గతంలో  విశ్వవ్యాప్తంగా  ప్రశంసలు అందేవి.  అయితే  దురదృష్టవశాత్తు  ఇపుడు మోదీ సర్కారు విదేశాంగ విధానంలో  స్పష్టమైన వైఖరి లేకుండా ఊగిసలాడుతున్న  తీరుతో  భారత్  నవ్వులపాలవుతోంది.  ఇరాన్‌‌పై  అమెరికా, ఇజ్రాయెల్  ప్రారంభించిన యుద్ధంపై వ్యాఖ్యానించడానికే జంకుతూ మౌనం దాల్చిన బీజేపీ ప్రభుత్వం తీరుతో అంతర్జాతీయంగా నైతికతను  కోల్పోయినట్టు అయ్యింది.  ఎక్కడో యుద్ధం అయితే  మనకేంటీ అంటూ వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం ఉదాసీన  వైఖరితో  దేశ ప్రయోజనాలకు భంగం  కలుగుతున్నది. 


పశ్చిమాసియాలో  తీవ్రమైన యుద్ధ  ప్రభావం  ఇప్పుడు  మన దేశంపై  ప్రత్యక్షంగాపడి చమురు, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో దేశ ప్రజలు  ఆందోళన  చెందుతున్నారు.   మోదీ ఫిబ్రవరి చివరివారంలో ఇజ్రాయెల్  పార్లమెంట్​లో   ప్రసంగించి  భారత్  చేరుకున్న  రెండు రోజుల వ్యవధిలో  ఆ దేశం అమెరికాతో  కలిసి ఇరాన్‌‌పై యుద్ధం ప్రారంభించింది. ఇరాన్​ సుప్రీం లీడర్  ఖమేనీతో సహా  ఇతర కీలక నేతలను ఫిబ్రవరి 28వ తేదీన  మట్టుపెట్టింది. ఈ యుద్ధ  సమాచారం  ప్రధాని మోదీకి  ముందే  తెలుసనే అభిప్రాయం అంతర్జాతీయంగా వెలువడుతోంది. ఖమేనీ  మృతిపై  స్పందించడానికి  కూడా మోదీ  ప్రభుత్వం  అమెరికా  బూచీతో  వెనుకాడింది.  ఇంటా బయటా అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పని పరిస్థితుల్లో  వారంరోజుల తర్వాత మార్చి 5వ తేదీన సంతాపం ప్రకటించింది. గతంలో కూడా అమెరికా తీవ్ర ఒత్తిడికి  తలొగ్గి  ఇరాన్,  రష్యా,  ఇజ్రాయెల్,  పాలస్తీనా  అంశాల్లో  కేంద్రం  ప్రభుత్వం  ఊగిసలాట వైఖరిని ప్రదర్శించింది.     ట్రంప్  మోదీ  చేతకానితనాన్ని  ఆసరాగా  చేసుకొని  భారత్‌‌పై  పన్నుల రూపంలో  ఆర్థికంగా ఒత్తిడి తేవడమే కాకుండా మన దేశ ప్రతిష్టకు కూడా భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు.

నెహ్రూ కాలం  నుంచి రష్యాతో  స్నేహం

భారత తొలి ప్రధాని జవహర్​లాల్  నెహ్రూ కాలం నుంచి రష్యా దేశం  మనకు  విశ్వాసమైన మిత్ర దేశంగా ఉంది.   ఇందిరా గాంధీ,  రాజీవ్ గాంధీ,   పీవీ  నరసింహారావు,   మన్మోహన్ సింగ్ హయాంల వరకు ఇదే స్నేహం కొనసాగింది.   చమురు  నిక్షేపాలు భారీగా  ఉన్న రష్యాతో  మనకు  బలమైన  ఆర్థిక సత్సంబంధాలు ఉండడమే  కాకుండా..  రక్షణ,  సాంకేతిక పరంగా కూడా వ్యూహాత్మక సహాయ సహకారాలుండేవి.  అయితే ఇప్పుడు  అమెరికాకు చేరువవుతున్న  మోదీ  ప్రభుత్వం  నమ్మకమైన  రష్యా  మిత్రత్వాన్ని దూరం చేసుకుంటూ వ్యూహాత్మక తప్పిదం చేస్తోంది.  అమెరికా  వ్యూహాత్మక  ఒత్తిడికి లొంగి అక్కడి నుంచి తీసుకోవడానికి  వెనుకంజ  వేస్తున్నది.   ఇరాన్ నుంచి మనకు అతి చవకగా లభించే చమురుపై  కూడా  అమెరికా  ఆంక్షలకు లొంగింది.  ఇదే విషయాన్ని లోక్​సభ  ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ  గతంలో  పలుమార్లు గళమెత్తారు.  బీజేపీ వైఫల్యాలు ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో  తేటతెల్లమైంది.  పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో రష్యా నుంచి తాత్కాలికంగా 30 రోజులు  చమురు  కొనుగోలుకు  భారత్ ప్రభుత్వానికి  అనుమతి  ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించడం  మన దేశ సార్వభౌమత్వానికే  అవమానకరం. 

చమురు నిక్షేపాలున్న దేశాలతో  విభేదాలు

విదేశీ  వ్యవహారాల్లో గతంలో కాంగ్రెస్  ప్రభుత్వాలు  దేశ ప్రయోజనాల దృష్ట్యా  వ్యూహాత్మకంగా  వ్యవహరించింది.  ఇజ్రాయెల్‌‌తో  టెక్నాలజీ,  రక్షణ రంగాల్లో  సాన్నిహిత్యం  కొనసాగించినా  పాలస్తీనాతో  మిత్రత్వాన్ని  చెడగొట్టుకోలేదు.  ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం   మంచి,  చెడు ఆలోచించకుండా  బహిరంగంగా  ఇజ్రాయెల్‌‌కు  మద్దతు  ప్రకటిస్తుండడంతో  అరబ్ దేశాలతో  శత్రుత్వం పెరిగింది.  యుద్ధ ప్రభావం దేశంపై ఉండ‌‌ద‌‌ని  కేంద్ర ప్రభుత్వం  ప్రకట‌‌నలు చేస్తున్నా  గ్యాస్, చమురు స్టాక్‌‌లపై  పలు బంకుల వద్ద బ్యానర్లు కూడా దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది.  ఒకవైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ మరోవైపు దేశంపై యుద్ధప్రభావం లేదని  చెప్పడం హాస్యాస్పదం.

 బయటపడుతున్న మోదీ డొల్లతనం

పశ్చిమాసియాలో  ప్రస్తుతం నెల‌‌కొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి.  పాకిస్తాన్‌‌కు  వ్యతిరేకంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌‌ను విజయవంతంగా  నిర్వహిస్తున్న దశలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో అనాలోచితంగా ఆపేయడం వ్యూహాత్మక తప్పిదం.   ఈనేపథ్యంలో  ఇందిరా గాంధీ  గతంలో  పాకిస్తాన్‌‌ను  చావుదెబ్బ కొట్టిన విషయాన్ని దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.  దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా,  ఇతర రాజకీయుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నరేంద్ర మోదీ యుద్ధ విరమణ చేయడంతో  మన  సైనికుల శ్రమ వృథా అయ్యింది. భారత్,   పాక్ మధ్య  యుద్ధం తానే  ఆపినట్టు  ట్రంప్  వివిధ  వేదికలపై  పదేపదే  చెప్పినా నరేంద్ర  మోదీ ఒక్కసారి కూడా ఖండించలేదు. 

విదేశీ వ్యవహారాల్లో దృఢ     వైఖరిని అవలంబించాలి 

సుంకాలు  విధిస్తానని,  యుద్ధాన్ని ఆపేశానని  ప్రకటించిన  ట్రంప్.. యుద్ధం  తర్వాత  చెప్పినట్టే  భారత  దిగుమతులపై  టారిఫ్ విధిస్తూ దేశ వాణిజ్య రంగాన్ని  కుదేలు  చేస్తున్నారు.  ఇండియా,  అమెరికా మధ్య  సుమారు 190 బిలియన్  డాలర్ల  వాణిజ్యంపై  ప్రభావంపడి రూ. లక్షల కోట్ల నష్టం  జరుగుతోంది. అంతేకాక  పలు ఆంక్షలు విధిస్తూ  విద్య, ఉద్యోగాల కోసం ఆ దేశానికి వెళ్తున్న యువతను  ఇబ్బందిపాలు చేస్తున్నారు. మేమిద్దరం ఆప్తమిత్రులమని మోదీ, ట్రంప్ పలు సందర్భాల్లో  చెప్పుకున్నారు. మరి మన దేశానికి నష్టం జరుగుతున్న క్రమంలో మోదీ  తన స్నేహితుడు ట్రంప్‌‌ను  ఎందుకు  ఒప్పించలేకపోతున్నారో  తెలియదు.   నెహ్రూ, ఇందిరా గాంధీలపై అవాకులు చెవాకులు పేల్చే మోదీ బృందం కాంగ్రెస్  దేశంకోసం చేసిన సేవ,  విదేశీ వ్యవహారాల్లో వారు తీసుకున్న గట్టి నిర్ణయాలను  స్ఫూర్తిగా  తీసుకోవాలి.  వారి హయాంలో అగ్రరాజ్యం అమెరికా కానీ,  వారి తొత్తు దేశం పాకిస్తాన్ కానీ భారత్‌‌పై  కన్నెత్తి  చూసేందుకు సాహసించ లేదు.  ఇప్పటికైనా  మోదీ ప్రభుత్వం భారత దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని  అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా విదేశీ వ్యవహారాల్లో దృఢ వైఖరిని ప్రదర్శించాలి.

- బి.మహేశ్ కుమార్ గౌడ్, 
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు


ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.