హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివిధ వైద్య సంఘాలు తెలిపాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే గడ్డిమందు అమ్మాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించాయి. మంగళవారం ‘డాక్టర్స్ అగైనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్’(డీఏపీపీ), హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పారాక్వాట్ శరీరంలోకి వెళితే ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతిని 'మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్'తో బాధితుడు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు.
