- కిరాణా షాపులు, హోటళ్లకు సరఫరా
- తయారీ గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్
మెహిదీపట్నం, వెలుగు: కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని హబీబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. మల్లేపల్లి అఫ్జల్‌సాగర్ ప్రాంతంలోని గటాల మసీదు సమీపంలో ‘షెహజాదా ఫుడ్ మాస్టర్’ ప్రాంగణంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అఘాపురాకు చెందిన మహమ్మద్ ఫారూఖ్(50) అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలు కలిపి అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారైన పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో మూతలు లేకుండానే నిల్వ ఉంచారు.
ఈ కల్తీ పేస్ట్‌ను హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నారు. నిర్వాహకుడి లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.2.20 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి.రాఘవేందర్, ఎస్సై జి.శ్రీకాంత్, హబీబ్‌నగర్ ఎస్సై కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
