నాపై విచారణ జరపండి.. సీఎంకు దేశ్‌ముఖ్ లేఖ

నాపై విచారణ జరపండి.. సీఎంకు దేశ్‌ముఖ్ లేఖ

ముంబై: సచిన్ వాజేపై వసూళ్ల కోసం ఒత్తిడి పెంచారంటూ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌‌ముఖ్పై ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో అనిల్ రాజీనామా చేయాల్సిందేనని బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయ. ఈ విషయంపై అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. ఈ కేసు విషయంలో తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అనిల్ ఓ లేఖ రాశారు. ఈ లెటర్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరబ్ బీర్ సింగ్ తనపై వస్తున్న ఆరో్పణల మీద దర్యాప్తు చేయాలని ఆ లేఖలో ఠాక్రేను అనిల్ కోరారు. విచారణ జరిపితేనే నిజాల నిగ్గు తేలుతుందని, సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి ముందు లభించిన కారులో పేలుడు పదార్ధాలు బయటపడగా.. ఈ కేసులో అసిస్టెంట్ పోలీస్ ఇనస్పెక్టర్ సచిన్ వాజేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని సచిన్ వాజేను  అనిల్ దేశ్‌‌ముఖ్ ఆదేశించారని, అందుకోసం ఒత్తిడి పెంచారని పరమ్ బీర్ సింగ్ ఆరోపిస్తూ, ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయడం సంచలనంగా మారింది.