తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తూ..  కమిట్మెంట్తో పనిచేస్త: సంజయ్ జాజు

తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తూ..  కమిట్మెంట్తో పనిచేస్త: సంజయ్ జాజు
  • సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను గౌరవిస్తూ, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ‘వెలుగు’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పట్ల, ఇక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితుల పట్ల తనకు పూర్తి అవగాహనతో పాటు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతానని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా ఉండేలా అధికార యంత్రాంగాన్ని క్రియాశీలం చేస్తానని వెల్లడించారు. 

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త సీఎస్

సీఎస్‌‌గా బాధ్యతలు చేపట్టే ప్రక్రియలో భాగంగా సంజయ్ జాజు ఎంసీఆర్‌‌హెచ్‌‌ఆర్‌‌డీలోని బోధి పెవిలియన్‌‌లో సీఎం రేవంత్‌‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన  మంగళవారం రామకృష్ణారావుతో కలిసి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌‌లో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, రామకృష్ణారావు నుంచి సీఎస్‌‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు కొత్త సీఎస్‌‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్‌‌కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు సర్వీసు కాలం 2029 ఫిబ్రవరి వరకు ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో కలెక్టర్‌‌గా, వివిధ కార్పొరేషన్ల ఎండీగా  పని చేసిన అనుభవంతో పాటు, కేంద్ర సర్వీసుల్లో కూడా కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ- గవర్నెన్స్, పరిపాలనలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై సంజయ్‌‌ జాజుకు మంచి పట్టు ఉంది.