ఒత్తిడికి గురవుతున్నం.. పని భారం తగ్గించండి

ఒత్తిడికి గురవుతున్నం.. పని భారం తగ్గించండి

కోఠిలో ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్ల ధర్నా

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వం తమతో అడ్డగోలు చాకిరి చేయించుకుంటోందని, పని భారంతో తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఏఎన్‌ఎంలు, మల్టీపర్పస్‌ హెల్త్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్‌ లోడును తగ్గించేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ ఎదుట గురువారం ధర్నా చేశారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అన్ని జిల్లాల నుంచి ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ప్రస్తుతం 36 రకాల ఆరోగ్య కార్యక్రమాల కోసం తాము పనిచేస్తున్నామని, ఇందుకోసం 36 రికార్డులు రాయాల్సి వస్తోందన్నారు.

పగలు రికార్డులు రాసి, రాత్రి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాల్సి వస్తోందన్నారు. దీంతో కుటుంబంతో గడపలేకపోతున్నామని, సెలవులు కూడా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లను రెగ్యులరైజ్ చేయడం సహా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. తర్వాత పోలీసులు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేత మహంతి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. కమిషనర్‌‌కు వినతిపత్రం అందజేసి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.