అహిల్యానగర్:ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే సూచించారు. ఈ మేరకు గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. హింసాత్మక ఘటనలు, ఘర్షణలు పరిస్థితిని మరింత దెబ్బతీస్తాయని, చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు.
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్, బలప్రయోగాన్ని ఖండించారు. విద్యార్థుల ఆందోళనను కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడకుండా, వారు లేవనెత్తిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు.
మరోవైపు, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా అన్నా హజారే నిలిచారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గురువారం 2 గంటలపాటు ఆయన ‘మౌన దీక్ష’ చేపట్టారు.
