వార్షిక నివేదిక ప్రకటించిన ట్రాన్స్‌‌‌‌కో

వార్షిక నివేదిక ప్రకటించిన ట్రాన్స్‌‌‌‌కో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ప్రభుత్వ రంగ సంస్థ ట్రాన్స్‌‌‌‌కో రూ.వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. తాము రూ.10,259.65 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు తెలంగాణ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌ కంపెనీ ప్రకటించింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  ట్రాన్స్‌‌‌‌కో  2020–21 వార్షిక నివేదికను  సర్కారుకు అందజేసింది. తాజా నివేదికతో విద్యుత్‌‌‌‌ సంస్థలకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌‌‌‌కో  ఆదాయం  పెరగడం లేదని స్పష్టమవుతోంది. 2020-–21లో  రూ.273.77 కోట్ల నికర ఆదాయం లభించిందని ట్రాన్స్​కో తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అదే ఏడాది  వార్షిక సంవత్సరంలో కరెంటు సరఫరా ద్వారా, ఇతర ఆదాయంతో కలిపి  ఆ ఏడాదిలో వచ్చిన ఆదాయం రూ.2,891.43 కోట్లుగా ప్రకటించింది. విద్యుత్‌‌‌‌ ఉద్యోగుల ఖర్చు, ఫైనాన్స్‌‌‌‌ కాస్ట్‌‌‌‌, ఇతరాలు కలిపి రూ.2,430.36 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. వచ్చిన ఆదాయంలో ఖర్చులు, నష్టం, ట్యాక్స్‌‌‌‌లు పోగా నికర ఆదాయం రూ.273.77 కోట్లని వివరించింది.

2020–21లో చేసిన అప్పులు 2,172.91 కోట్లు

2019–20 నాటికే ట్రాన్స్‌‌‌‌కో అప్పులు రూ.9,413.41 కోట్లు ఉన్నాయి. దీనికి అదనంగా  2020–21లో రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ నుంచి రూ.721.97 కోట్లు అప్పు తీసుకుంది. పవర్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నుంచి రూ.1,150.93 కోట్ల రుణాలు తీసుకుంది. పీటీసీ సంస్థ నుంచి మరో రూ.300 కోట్ల  రుణం తీసుకుంది. ఇలా 2020–21లో చేసిన అప్పులు రూ.2,172.91 కోట్లుగా ట్రాన్స్​కో తన నివేదికలో పేర్కొంది.  ప్రధానంగా ఆర్‌‌‌‌ఈసీ నుంచి తీసుకున్న రూ.406.17 కోట్లు, పీఎఫ్‌‌‌‌సీకి రూ.805.46 కోట్లు, నాబార్డుకు రూ.18.82 కోట్లు, ఒరియంటల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌  ఆఫ్‌‌‌‌  కామర్స్‌‌‌‌కు రూ.26.29 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.18.75 కోట్లు, తమిళనాడు మర్కంటైల్‌‌‌‌ బ్యాంకుకు రూ.2.50 కోట్లు ఇలా మొత్తం రూ.1326.67 కోట్లను  పాత బాకీలు చెల్లించడానికి వినియోగించింది.  పాత బాకీలకు తోడు  కొత్తగా తీసుకున్న అప్పులు, చెల్లించిన బాకీలు పోను నికరంగా రూ.10,259.65 కోట్ల అప్పులు ఉన్నట్టు ట్రాన్స్​కో తన వార్షిక నివేదికలో పేర్కొంది.