యాదాద్రి ఆలయంలో మరో 24 కేసులు.. 4 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు 

యాదాద్రి ఆలయంలో మరో 24 కేసులు.. 4 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు 
  • యాదాద్రి ఆలయంలో మరో 24 కేసులు
  • 71కి చేరిన కరోనా బాధితులు
  • 4 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు 

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి ఆలయంలో మరో 24 మందికి కరోనా వచ్చింది. మంగళవారం యాదగిరిగుట్టలోని తులసీ కాటేజీలో ఏర్పాటు చేసిన కొవిడ్ స్పెషల్ మొబైల్ క్యాంప్ లో 244 మందికి టెస్టులు చేయగా, 24 మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు చెప్పారు. వీరిలో 8 మంది ఆలయ ఉద్యోగుల ఫ్యామిలీ మెంబర్లు, కల్యాణకట్టలో పని చేస్తున్న ముగ్గురు బార్బర్లు, ఒక పూజారి  ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71కి చేరింది. యాదాద్రి కొండ పైనున్న ప్రైవేట్ హోటల్​లో పనిచేసే నలుగురికి వైరస్ సోకినట్లు తేలడంతో, ఆఫీసర్లు హోటల్ ను మూసివేయించారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో మరో 4 రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మొదట ఈ నెల 30 వరకు ఆర్జిత సేవలను రద్దు చేయగా ఇప్పుడు  ఏప్రిల్ 3 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు.  దీంతో స్వామి వారి నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమాలు, అష్టోత్తర పూజలు నిలిచిపోనున్నాయి. 

భక్తులు లేక వెలవెల..  
కరోనా ఎఫెక్ట్ తో భక్తులు లేక యాదాద్రి వెలవెలబోయింది. ఆలయ పూజారులు, సిబ్బందికి వైరస్ సోకడంతో పాటు యాదగిరి పట్టణంలో కేసులు పెరుగుతుండటంతో భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు ఖాళీగా కనిపించాయి. మరోవైపు కరోనా కారణంగా కొండ కిందున్న వ్యాపారులు రెండ్రోజులు స్వచ్ఛందంగా షాపులు బంజేయడంతో.. అక్కడి రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.